India Vs England Semi Final 2024: ఇంగ్లాండ్ చేసిన గాయం సలుపుతూనే ఉంది.. రోహిత్ సేన.. లేపనం పూయాల్సిన సమయం ఇదే..

వెస్టిండీస్ - అమెరికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో రెండవ సెమీస్ లో భాగంగా టీమిండియా - ఇంగ్లాండ్ జట్లు గయానా వేదికగా గురువారం తలపడనున్నాయి. నవంబర్ 10, 2022 తర్వాత ఈ రెండు జట్లు టి20 మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. ఇక టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలు సాధించి సెమీస్ చేరుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 27, 2024 12:33 pm

India Vs England Semi Final 2024

Follow us on

India Vs England Semi Final 2024: అది 2022.. టి20 వరల్డ్ కప్.. సెమీస్ పోరు.. టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు తల పడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగుల స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా, 16 ఓవర్లలోనే విజయం సాధించింది. కెప్టెన్ బట్లర్(49 బంతుల్లో 80), మరో ఆటగాడు అలెక్స్ హెల్స్(47 బంతుల్లో 86) విధ్వంసాన్ని సృష్టించారు. రోహిత్ సేనకు టి20లో కనీవినీ ఎరుగని ఓటమిని రుచి చూపించారు. నాటి ఓటమి టీమిండియా ఆటగాళ్ళనే కాదు, అశేషమైన అభిమానులను కూడా దు:ఖంలో ముంచింది. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 229 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన ఇంగ్లాండ్ 129 పరుగులకు కుప్ప కూలింది. మొత్తంగా 100 పరుగుల తేడాతో ఓడిపోయింది.. అయినప్పటికీ 2022 t20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి గట్టి బదులు తీర్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.

వెస్టిండీస్ – అమెరికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో రెండవ సెమీస్ లో భాగంగా టీమిండియా – ఇంగ్లాండ్ జట్లు గయానా వేదికగా గురువారం తలపడనున్నాయి. నవంబర్ 10, 2022 తర్వాత ఈ రెండు జట్లు టి20 మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. ఇక టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలు సాధించి సెమీస్ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్లో పాకిస్తాన్ పాకిస్తాన్, సూపర్ -8 మ్యాచ్లో ఆస్ట్రేలియా వంటి జట్లను మట్టికరిపించి గ్రూప్ – 1 లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉన్నారు. విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. శివం దూబే ఆశించినంత స్థాయిలో ఆడ లేకపోతున్నాడు.. ఇక బౌలింగ్ లో బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. హర్ష్ దీప్ సింగ్ అద్భుతాలు చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా జట్టుకు అవసరమైనప్పుడల్లా తన వంతు సాయం చేస్తున్నాడు. కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ పర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్ పరంగా భారత్ కు పెద్దగా ఇబ్బంది లేదు. ఫీల్డింగ్ లోనూ వంక పెట్టడానికి లేదు. అయితే ఇంగ్లాండ్ జట్టుతో మ్యాచ్ అనగానే భారత జట్టులో ఏదో తెలియని ఒత్తిడి కనిపిస్తోంది. దానిని కనుక అధిగమిస్తే ఈ మ్యాచ్లో టీమ్ ఇండియాకు తిరుగు ఉండదు.

ఇక ఇంగ్లాండ్ విషయానికొస్తే.. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో సూపర్ -8 దశలో మూడు మ్యాచ్లు ఆడి.. రెండు గెలిచింది.. ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్, బ్రూక్, మోయిన్ అలీ, ఫిలిప్ సాల్ట్, జానీ బెయిర్ స్టో, లివింగ్ స్టోన్, సామ్ కరణ్ వంటి వారితో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. జోర్డాన్, ఆర్చర్, ఆదిల్ రషీద్, టోప్లీ, బెన్ డకెట్ బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. ముఖ్యంగా జోర్డాన్, ఆర్చర్ సూపర్ ఫామ్ లో ఉన్నారు.. వీరు గనుక సెమీస్ మ్యాచ్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే.. భారత జట్టుకు కష్టాలు తప్పవు.

ఇక ఇప్పటివరకు భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య 23 t20 మ్యాచ్ లు జరిగాయి.. ఇందులో టీం ఇండియా 12 మ్యాచ్లు గెలిచింది. ఇంగ్లాండ్ 11 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు టి20 మ్యాచ్లలో టీమిండియా మూడు, ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లలో గెలిచింది. సెమీఫైనల్ మ్యాచ్ కు వేదికైన గయానా మైదానం.. పేస్ బౌలర్లకు అనుకూలిస్తుంది. గత కొద్దిరోజులుగా ఇక్కడ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ మైదానంపై తేమ ఎక్కువగా కనిపిస్తోంది. పేస్ బౌలర్లకు ఈ మైదానం నుంచి గట్టి సపోర్ట్ లభించనుంది. స్పిన్నర్లు కూడా ఈ మైదానంపై మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఈ మైదానంపై 127 పరుగులు సగటు స్కోర్ గా నమోదయింది. . రెండవ ఇన్నింగ్స్ లో సగటు స్కోరు 95 పరుగులుగా రికార్డయింది. ఈ మైదానంలో ఇప్పటివరకు 34 అంతర్జాతీయ మ్యాచులు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 16 సార్లు, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 14 సార్లు విజయాలు సాధించాయి. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం టీమిండియాకు 58%, ఇంగ్లాండ్ జట్టుకు 42% గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.

జట్ల అంచనా ఇలా

భారత్

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, కులదీప్ యాదవ్, శివం దూబే, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా.

ఇంగ్లాండ్

బట్లర్ (కెప్టెన్/ వికెట్ కీపర్), సాల్ట్, బెయిర్ స్టో, బ్రూక్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, సామ్ కరణ్, జోర్డాన్, ఆర్చర్, టోప్లీ, ఆదిల్ రషీద్.