BAN vs IND : అదే నిర్లక్ష్యం.. అవే చెత్త షాట్లు. వరుస ఓటములు ఎదురవుతున్నా… ఇంటా బయటా విమర్శలు వస్తున్నా.. కొంచెం కూడా మార్పు రావడం లేదు.. వెరసి భారత జట్టు వరుసగా రెండో సిరీస్ కూడా కోల్పోయింది.. బంగ్లాదేశ్ జట్టు వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సీరిస్ దక్కించుకుంది. టి20 మెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లో జరిగిన పరాభవానికి బదులు తీర్చుకుంది.

ఆదిలో వికెట్లు తీశారు కానీ..
రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు నిలువరించారు. 69 పరుగులకే 6 వికెట్లు తీశారు.. దీంతో బంగ్లా జట్టు కనీసం 100 పరుగులైనా చేస్తుందా అని అందరూ అనుకున్నారు. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన మిరాజ్, మహమదుల్లా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఏడో వికెట్ కు 148 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో మిరాజ్ సెంచరీ పూర్తి చేశాడు. మహమ్మదుల్లా 77 పరుగులు చేశాడు. ఆరు వికెట్లు టకా టకా తీసిన భారత బౌలర్లు ఈ జోడిని విడదీసేందుకు ప్రయాసపడ్డారు. భారత బౌలర్ల లోపాలను ఈ బ్యాట్స్ మెన్ తమకు అనుకూలంగా మార్చుకొని జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇందులో 17 ఎక్స్ ట్రాల రూపంలో రావడం గమనార్హం.
ఏమాత్రం గెలవాలనే సోయి లేదు
అనంతరం తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ నిర్లక్ష్యపు షాట్లు ఆడి త్వరగా పెవిలియన్ చేరారు. వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ కూడా వారి బాటనే అనుసరించారు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే దశలో భారీ షాట్లు ఆడబోయి వరుస ఓవర్లలో వెను దిరిగారు. అప్పటిదాకా మ్యాచ్ భారత్ గెలుస్తుందని ఆశలు ఉండేవి. కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. పైగా టెస్ట్ మ్యాచ్ మాదిరి బ్యాటింగ్ చేశారు. దీంతో బంతులు కరిగిపోయి లక్ష్యం పెద్దదైపోయింది. పైగా మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ బ్యాటింగ్ చూస్తే.. ఎందుకు తీసుకున్నార్రా బాబు వీరిని జట్టులోకి అనిపించింది. వీరు ముగ్గురు కనుక కొంతమేర ప్రభావం చూపినా ఫలితం మరోలా ఉండేది.
రోహిత్ మెరుపులు
చివరిలో బ్యాటింగ్ కు వచ్చిన రోహిత్ శర్మ మెరుపులు మెరిపించాడు. ఒకవేళ అతడు ఏడో వికెట్ బ్యాట్స్మెన్ గా వచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. 28 బంతుల్లో 51 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మొత్తానికి భారత జట్టు వరుసగా రెండో వన్డే సిరీస్ కూడా కోల్పోయింది.