India Vs West Indies T20: టెస్టుల్లో చిన్న జట్లకు కూడా పోటీ ఇచ్చే స్థితిలో లేని వెస్టిండీస్.. టీమ్‌ఇండియా ధాటికి ఏమాత్రం నిలవలేదన్నది అందరూ ఊహించిన విషయమే. ఆ అంచనాకు తగ్గట్లే ఏకపక్షంగా సాగింది టెస్టు సిరీస్. కానీ వన్డేలకు వచ్చేసరికి కరీబియన్ జట్టు నుంచి కొంత పోటీ కనిపించింది. ఇప్పుడిక టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఫార్మాట్లో వెస్టిండీస్ ఆటగాళ్లు సిద్ధహస్తులే. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో మెరుపులు మెరిపించే విండీస్ వీరులు.. కుర్రాళ్లతో నిండిన భారత జట్టుకు సవాల్ విసరడం ఖాయం.
ఫామ్‌లో విండీస్ ఆటగాళ్లు..
ఈ మధ్యే అమెరికాలో మేజర్ క్రికెట్ లీగ్ టోర్నీ తొలి సీజన్ ముగిసింది. ఆ టోర్నీ ఫైనల్లో నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. 55 బంతుల్లోనే 137 పరుగులతో అజేయంగా నిలిచిన పూరన్.. ఏకంగా 13 సిక్సర్లు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్ ఛేదనలో కావడం మరో విశేషం. పూరన్ ఒక్కడే కాదు.. కైల్ మేయర్స్, రోమన్ పావెల్, హెట్‌మయర్, హోల్డర్, రోస్టన్ చేజ్, ఒడియన్ స్మిత్, రొమారియో షెఫర్డ్.. వీళ్లంతా కూడా ప్రమాదకారులే. వీరిలో హెట్‌మయర్ మినహా అందరూ ఆల్‌రౌండర్లే కావడం గమనార్హం. టీ20ల్లో అత్యధిక మంది ఆల్‌రౌండర్లున్న జట్టు కూడా విండీసే. నిమిషాల్లో మ్యాచ్ ఫలితాలు మారిపోయేలా విధ్వంసం సృష్టించడం కరీబియన్ క్రికెటర్లకు అలవాటే. కాబట్టి టీమ్‌ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఆ ఇద్దరి అరంగేట్రం..
వెస్టిండీస్‌తో అయిదు టీ20ల సిరీస్‌లో భారత తుది జట్టు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లి లాంటి సీనియర్లు తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. తొలి రెండు వన్డేల్లో తడబడ్డప్పటికీ.. చివరి మ్యాచ్‌లో యువ బ్యాటర్లు సత్తా చాటారు. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మతోపాటు మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో టీ20 అరంగేట్రం చేసే అవకాశముంది. శుభ్‌మన్‌తో కలిసి యశస్వినే ఓపెనింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడొచ్చు. సంజు శాంసన్ ఆడటం అనుమానమే. అతను ఆడాలంటే ఇషాన్ తన స్థానాన్ని త్యాగం చేయాలి. తిలక్ నాలుగో స్థానంలో ఆడతాడని అంచనా. అనుభవజ్ఞులైన కెప్టెన్, హార్దిక్ పాండ్య, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. మూడో స్పిన్నర్‌గా చాహల్, రవి బిష్ణోయ్‌ల్లో ఒకరిని ఎంచుకునే అవకాశం కూడా ఉంది. టెస్టుల్లో, వన్డేల్లో అరంగేట్రం చేసి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న ముకేశ్ టీ20ల్లో కూడా అవకాశం అందుకోనున్నాడు. అతను ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్‌లలో ఒకరితో కొత్త బంతిని పంచుకుంటాడు. పేస్ బౌలింగ్ దీటుగా ఎదుర్కొనే విధ్వంసక విండీస్ బ్యాటర్లను భారత బౌలర్లు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.
కుర్రాళ్ల కోసమే..
కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తుది జట్టుకు దూరంగా ఉన్నారని.. చివరి రెండు మ్యాచ్‌ల్లో జట్టును నడిపించిన హార్దిక్ పాండ్య తెలిపాడు.
సౌకర్యాలపై అసంతృప్తి..
వన్డే సిరీస్ సందర్భంగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు సరిగా చేయకపోవడంపై హార్దిక్ పాండ్య అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఇంకోసారి వెస్టిండీస్‌కు వచ్చినపుడు పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నా. ప్రయాణాలకు తోడు చాలా విషయాలను మేం చూసుకోవాల్సి వచ్చింది. గత ఏడాది వచ్చినపుడు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాం. పర్యాటక జట్టుగా మేం ఖరీదైన సౌకర్యాలు కోరుకోవట్లేదు. కానీ కొన్ని అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే ఆట పరంగా అంతా బాగా సాగింది’ అని హార్దిక్ అన్నాడు.
పరుగుల పిచ్
తొలి టీ20కి ఆతిథ్యమివ్వనున్న బ్రియాన్ లారా స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుంది. భారత్, విండీస్ చివరి వన్డే జరిగింది ఇక్కడే. టీమ్‌ఇండియా బ్యాటర్లు జట్టుకు 350 పైచిలుకు స్కోరు సాధించిపెట్టారు. బౌలర్లకు కూడా పిచ్ నుంచి సహకారం ఉంటుంది. పేసర్లతో పాటు స్పిన్నర్లకూ వకాశముంటుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సూచనలున్నాయి.
తుది జట్లు (అంచనా)..
భారత్ : శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ (కెపెన్), సూర్యకుమార్, అక్షర్ పటేల్, కుల్‌దీప్, చాహల్/రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్/అవేష్ ఖాన్, ముకేశ్‌కుమార్.
వెస్టిండీస్: మేయర్స్, కింగ్, హోప్/చార్లెస్, పూరన్, హెట్‌మయర్, రోమన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్/ఒడియన్ స్మిత్, అకీల్, అల్జారి జోసెఫ్.