Telangana Congress: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇవే కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం చత్తీస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఎన్నికల జరిగే మిగతా రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.. ఇందులో భాగంగానే ఇప్పటినుంచే కసరత్తు మొదలైంది. భారతీయ జనతా పార్టీ కంటే ముందుగానే నాలుగు రాష్ట్రాల్లో స్టీరింగ్ కమిటీలను నియమించింది. మిజోరం రాష్ట్రానికి ఇంకా స్టీరింగ్ కమిటీ నియమించలేదు. ఈ స్టీరింగ్ కమిటీలో సీనియర్లను నియమించింది. వారికి కీలక బాధ్యతలు అప్పగించింది. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఒక్కో స్టీరింగ్ కమిటీలో 5 నుంచి 8 మంది నేతలను సభ్యులుగా నియమించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కే మురళీధరన్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. బాబా సిద్ధిక్, జిగ్నేష్ మేవాని ఇందులో సభ్యులు. బీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఐసీసీ ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, లోక్ సభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కమిటీకి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు అందరికీ ఇందులో స్థానం దక్కింది. రాజస్థాన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా గౌరవ్ గోగోయ్, మధ్యప్రదేశ్ చైర్మన్ గా జితేంద్ర సింగ్, చత్తీస్ గడ్ చైర్మన్ గా అజయ్ మాకెన్ నియమితులయ్యారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలను సభ్యులుగా, ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
అధికార బీజేపీ పలు రాష్ట్రాల్లో ఎదురీదుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి త్వరగా మేల్కొంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. ఇండియా కూటమిని ఏర్పాటుచేసి, దానికి సారధ్యం వహిస్తోంది. అంతేకాకుండా త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే పలు ప్రాణాలకు రూపొందించింది. అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటున్నది. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరును ఎండగడుతోంది. కాగా ఈసారి పైరవీలకి తావు లేకుండా కేవలం స్టీరింగ్ కమిటీ చెప్పిన వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చే లాగా ప్రణాళికలు రూపొందించింది. కొత్తగా పార్టీలో చేరే వారి సామర్థ్యం ఆధారంగా టికెట్లు జారీ చేసే అవకాశాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నది.