China Floods: చైనా భారీ ప్రమాదంలో పడింది. జల ప్రళయంలో చిక్కుకుంది. కనివిని ఎరుగని నష్టాన్ని చవి చూసింది. 140 ఏళ్లలో ఎరగని వరద బీభత్సంతో అల్లకల్లోలమవుతోంది. కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కురుస్తున్న వర్షాలు చైనా ను ప్రమాదపు అంచున నిలబెట్టాయి. దీంతో చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున పునరావాస, పునరుద్ధరణ పనులు చేపడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రధానంగా రాజధాని బీజింగ్ తో పాటు చుట్టుపక్కన పట్టణాలు వరద బీభత్సంతో అల్లాడుతున్నాయి. చాంగ్పింగ్ లో జలాశయం పరిసర ప్రాంతంలో రికార్డు స్థాయిలో 744.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది. 1891లో కురిసిన రికార్డు స్థాయి వర్షపాతం 609 మిల్లీమీటర్లు కాగా.. ఆ రికార్డును ఇప్పుడు అధిగమించింది.
భారీ వర్షాల ప్రభావంతో బీజింగ్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 12 మంది జాడ లేకుండా పోయింది. 8 లక్షల 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది. కాక సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ నదిలో రబ్బర్ పడవ బోల్తా పడిన ఘటనలో సహాయ సిబ్బంది ఒకరు చనిపోయారు. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. చైనాను వణికిస్తున్న జల జలప్రళయం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భయానకం సృష్టిస్తున్నాయి.