Ind vs Eng 5th Test Match Review: నైట్ వాచ్ మన్ గా వచ్చిన ఆకాష్ దీప్ హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కష్ట సమయంలో జట్టును ఆదుకున్నాడు. సెంచరీ చేసి అదరగొట్టాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపు వేగంతో పరుగులు చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో నిలబడి రవీంద్ర జడేజా మరో అర్థ శతకాన్ని సాధించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐదో టెస్టులో చాలానే జరిగాయి. తొలి ఇన్నింగ్స్ లో 200 కు పైగా పరుగులు మాత్రమే చేసి.. ప్రత్యర్థి జట్టు భారీ లీడ్ సాధించకుండా అడ్డుకట్ట వేసినప్పటికీ.. ఆతిథ్య జట్టు ఎదుట భారీ టార్గెట్ విధించినప్పటికీ.. విజయం సాధించడానికి టీమ్ ఇండియా చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరి వరకు పోరాడాల్సి వచ్చింది.
Also Read: అందరూ సిరాజ్ ను పొగుడుతున్నారు కానీ.. ప్రసిద్ద్ చేసింది తక్కువేం కాదు..
వాస్తవానికి టెస్ట్ క్రికెట్లో 370+ టార్గెట్ ఫినిష్ చేయడం అంత ఈజీ కాదు. వాస్తవానికి దీనిని సాధించేలాగా ఇంగ్లాండ్ జట్టు కనిపించింది. బ్రూక్, రూట్ కనుక కొద్దిసేపు ఉండి ఉంటే కచ్చితంగా అది జరిగేది. అప్పటికే టీమిండియా మ్యాచ్ మీద ఆశలు కూడా వదిలేసుకుంది. అయితే వీరిద్దరి వికెట్లను ఇంగ్లాండు జట్టు స్వల్ప తేడాతో కోల్పోవడంతో ఒత్తిడిలో కూరుకుపోయింది. మిగతా ప్లేయర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్ జట్టుకు ఆరు పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు..
మ్యాచ్ గెలిచింది కాబట్టి టీమిండియా ప్లేయర్ల మీద ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సిరాజ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒకవేళ ఐదో రోజు ఆటలో సిరాజ్ మూడు వికెట్లు తీయకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అసలు ఇక్కడ దాకా మ్యాచ్ రావడానికి ప్రధాన కారణం గౌతి మాత్రమే. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్ లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ స్పిన్ బౌలర్లు సత్తా చూపిన సందర్భాలు చాలా తక్కువ. అయితే కేవలం ముగ్గురు బౌలర్లతోనే గౌతమ్ గంభీర్ జట్టును ప్రకటించడం ప్రధాన లోపం. సాయి దర్శన్ స్థానంలో అర్ష్ దీప్ సింగ్ ను తీసుకొని ఉంటే.. మ్యాచ్ ఫలితం మరింత తొందరగా వచ్చేది. ఎందుకంటే అప్పటికే ఆకాశ్ దీప్ అలసిపోయాడు. సిరాజ్ తప్పనిసరి పరిస్థితిలో బౌలింగ్ వేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఇబ్బంది పడుతూనే బంతులు వేశాడు. వీరి ముగ్గురి మీద ఒత్తిడి తగ్గించడానికి గిల్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
సేనా (సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై టెస్ట్ సిరీస్ ఆడుతున్నప్పుడు టీమిండియా కచ్చితంగా నలుగురు ఫాస్ట్ బౌలర్లతో రంగంలోకి దిగాలి. గతంలో కూడా టీమిండియా మేనేజ్మెంట్ ఇదే విధానాన్ని అనుసరించింది. అయితే కేవలం ముగ్గురు బౌలర్లతో గౌతమ్ గంభీర్ జట్టును ప్రకటించడం ఒకరకంగా ఇబ్బందికరమైన పరిణామాలకు కారణమైంది. కేవలం ముగ్గురు బౌలర్లు మాత్రమే బౌలింగ్ వేయడం వల్ల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలానే జరిగితే బౌలర్లు గాయపడతారు.. ఆ తర్వాత జట్టుకు దూరమవుతారు. గతంలో బుమ్రా ను ఇదేవిధంగా వాడటం వల్ల ప్రస్తుతం అతడు పూర్తిస్థాయిలో జట్టుకు సేవలు అందించలేకపోతున్నాడు. ఇప్పుడు సిరాజ్ కు ఎటువంటి గాయం కాకపోయినప్పటికీ.. ఇలానే అతడు నిర్వి రామమైన క్రికెట్ ఆడితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇక ఫీల్డింగ్ విషయంలోను టీమిండియా మెరుగుపడాలి. ఎందుకంటే సిరాజ్ వదిలేసిన క్యాచ్ టీమిండియా విజయవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అలాగే స్లిప్పులో కేఎల్ రాహుల్ క్యాచ్ జారవిడిచిన తీరు కూడా ఇబ్బందికరమైన పరిణామానికి కారణమైంది.
Also Read: గెలుపు క్షణం.. గంభీర్ ఆనందానికి అవధుల్లేవ్.. గూస్ బంప్స్ వీడియో
వాస్తవానికి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల మీద ఒత్తిడి ఉంటుంది. కాకపోతే ఆ ఒత్తిడిని జయిస్తేనే ఫలితం ఉంటుంది. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ కొన్ని సందర్భాలలో మాత్రమే మెరిశారు. మిగతా అన్ని సందర్భాలలో చేతులెత్తేశారు. అయితే తదుపరి టెస్ట్ సిరీస్లలో ఈ స్థానాలలో వారిని ఆడిస్తారా.. కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారా అనేది చూడాల్సి ఉంది.. మరోవైపు ఈ ప్రయోగం టీమిండియా కు విజయాన్ని అందించినప్పటికీ.. చాలా ప్రశ్నలను మిగులుచుతోంది. ఈసారి ఎలాగైనా డబ్ల్యూటీసి కప్ గెలవాలని టీమ్ ఇండియా అంచనాలతో ఉంది. అలాంటప్పుడు ఈ లోపాలను కచ్చితంగా సవరించుకోవాలి.