Ind Vs Eng 2nd Test Prasidh Krishna: సాధారణంగా టెస్ట్ క్రికెట్లో ఏ బౌలర్ కూడా ధారాళంగా పరుగులు ఇవ్వడు. సాధ్యమైనంతవరకు తన బెస్ట్ చూపించడానికి ప్రయత్నిస్తాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తే బోనస్ గా వికెట్లు కూడా లభిస్తాయి. అందువల్లే టెస్ట్ క్రికెట్ ను చాలామంది “బౌలర్ల ప్యారడైజ్” అని పిలుస్తుంటారు. కానీ ఆ పదానికి టీం ఇండియా బౌలర్లు వ్యతిరేక అర్ధాన్ని చెబుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా బౌలింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బౌలింగ్ వైపల్యం వల్లే తొలి టెస్ట్ ను టీమ్ ఇండియా కోల్పోయింది. రెండో టెస్టులో కూడా అదే పునరావృతమైంది. ఇంగ్లీష్ జట్టులో పేరు మోసిన బ్యాటర్లు త్వరగానే అవుట్ కాగా, బ్రూక్, జేమీ స్మిత్ ను అవుట్ చేయడానికి భారత బౌలర్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. బ్రూక్(158), జెమీ స్మిత్ (184*) పరుగులతో భారత బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు ఏకంగా 303 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం ఇంగ్లాండ్ జట్టుకు ఒక ధ్వజ స్తంభం లాగా నిలిచింది. వీరిద్దరిని ఔట్ చేయడానికి టీం ఇండియా కెప్టెన్ ఎంతో మంది బౌలర్లను ప్రయోగించాడు . అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
Also Read: ఒక్క ఓవర్ లో 23 పరుగులా? ప్రసిద్ద్ కృష్ణను ఎంపిక చేసిన వారికి దండం పెట్టాలి!
ప్లాట్ పిచ్ పై బౌన్సర్లతో పెద్దగా ప్రయోజనం ఉండదు.. షార్ట్ పిచ్ బంతులు కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేదు. ఈ విషయం భారత బౌలర్లకు తెలియకుండా పోయింది.. అప్పటిదాకా 5 వికెట్లు తీసి ఉత్సాహంగా ఉన్న భారత బౌలర్లు.. ఎప్పుడైతే బ్రూక్, స్మిత్ వచ్చారో.. ఒక్కసారిగా లయ తప్పిపోయారు. ముఖ్యంగా ప్రసిధ్ కృష్ణ దారుణంగా బౌలింగ్ వేశాడు.. 13 ఓవర్లు బౌలింగ్ వేసి.. 72 పరుగులు ఇచ్చాడు. ఒక ఓవర్ లో అయితే ఏకంగా 23 పరుగులు ఇచ్చాడు. ఇక అప్పటినుంచి ఇంగ్లాండ్ ఆ టగాళ్లు ఒక్కసారిగా గేర్ మార్చారు. ఏమాత్రం భయపడకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశారు.. ఆ తర్వాత క్రమక్రమంగా భారత ఆధిపత్యాన్ని తగ్గించడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఆకాశ్ దీప్ కనక బ్రూక్ ను క్లీన్ బౌల్డ్ చేయకుండా ఉండి ఉంటే.. మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది.
వాస్తవానికి ప్రసిద్ కృష్ణ తొలి టెస్ట్ లో అంతంత మాత్రమే ఆకట్టుకున్నాడు. అయితే అతడికి రెండో టెస్టులో చోటు దక్కడం పట్ల మాజీ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. బుమ్రా స్థానంలో చోటు సంపాదించుకున్న ఆకాష్ నాలుగు వికెట్లు తీసి అదరగొడితే.. రెండో టెస్ట్ లోనూ చోటు దక్కించుకున్న ప్రసిధ్ మాత్రం దారుణంగా తేలిపోయాడు. ఆడుతోంది టెస్ట్ అని మర్చిపోయి టి20 తరహాలో బౌలింగ్ వేశాడు. అసలే ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. పైగా సొంతమైదానం కావడంతో రెచ్చిపోయారు. ప్రసిద్ బౌలింగ్లో స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అయితే బౌలర్లు వికెట్లు తీయకపోయినా సరే.. కాస్త కట్టుదిట్టంగా బంతులు వేశారు. కానీ ప్రసిధ్ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు.. ప్లాట్ పిచ్ పై చెత్త బంతులు వేసి.. ఇంగ్లాండ్ బ్యాటర్లు పండగ చేసుకునేందుకు కారణమయ్యాడు. ఇంతటి దారుణమైన బౌలింగ్ వేస్తున్న అతడిని వచ్చే టెస్ట్ కు కొనసాగిస్తారా? అతడిని పక్కనపెట్టి అర్ష్ దీప్ కు చోటు కల్పిస్తారా? అనేది చూడాల్సి ఉంది.