IND VS BAN Test match : చెన్నై టెస్ట్ లో రెండో రోజు నాటకీయ పరిణామాలు.. మలుపులు తిరుగుతున్న మ్యాచ్.. భారత్ పరిస్థితి ఏంటంటే..

చెన్నై వేదిక జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండవ రోజు అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెడ్ సాయిల్ మైదానంపై రెండు జట్ల బౌలర్లు పండగ చేసుకున్నారు. వికెట్ల మీద వికెట్లు తీసి బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 20, 2024 5:57 pm

IND VS BAN Test match

Follow us on

IND VS BAN Test match :  తొలిరోజు వీరోచితంగా ఆడిన రవీంద్ర జడేజా (86) రెండవ రోజు వెంటనే తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సెంచరీ హీరో రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు చేసి తస్కిన్ మహమ్మద్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆకాష్ దీప్ 17 పరుగులు చేసి అతడు కూడా తస్కిన్ మహమ్మద్ బౌలింగ్ లో వెనుతిరిగాడు. బుమ్రా ఏడు పరుగులు చేసి హసన్ మహమూద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా దాటికి 149 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ చేసిన 32 పరుగులే హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం..

149 పరుగులకే..

మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే బంగ్లా ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం 2, జాకీర్ హసన్ 3 పరుగులకే వెనుతిరిగారు. షాద్మాన్ ఇస్లాం బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జాకీర్ హసన్ ఆకాష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ షాంటో సిరాజ్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడు 20 పరుగులు చేసి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ కొట్టడంతో.. విరాట్ ఆ బంతిని అత్యంత చాకచక్యంగా అందుకున్నాడు. మోమినుల్ ఆకాష్ దీప్ బౌలింగ్లో గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. ముష్ఫికర్ రహీం 8 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ దశలో షకీబ్ , లిటన్ దాస్(22) సమయోచితంగా ఆడారు. కుదురుకుంటున్నారనుకుంటున్న సమయంలో వీరిద్దరూ రవీంద్ర జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన హసన్ మిరాజ్ (27) కాస్త లో భారత బౌలర్లను ప్రతిఘటించినప్పటికీ.. అతడికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. బౌలర్లు హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్ ను బుమ్రా బోల్తా కొట్టించడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 149 పరుగుల వద్ద ముగిసింది.

భారత్ అదే తడ “బ్యాటు”

రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ మాదిరిగానే తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ పది పరుగులకే నహీద్ రాణా బౌలింగ్లో కీపర్ లిటన్ దాస్ కు క్యాచ్ ఇచ్చే అవుట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన పేలవమైన ఫాం కొనసాగించాడు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో జాకీర్ హసన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు.. ఇక విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు కొట్టి, 17 పరుగులు చేసి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. హసన్ మిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి గిల్(33), రిషబ్ పంత్ (12) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. రెండవ ఇనింగ్స్ లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 81 రన్స్ చేసింది. ఓవరాల్ గా 308 పరుగుల లీడ్ లో ఉంది. అయితే రెండో రోజు ఇరు జట్ల బౌలర్లు 17 వికెట్లు నేల కూల్చడం విశేషం.