Hyderabad Cricket Association : దేశ క్రికెట్ అసోసియేషన్ ల చరిత్రలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రత్యేకమైన పేజీ ఉంటుంది. ఎందుకంటే శివలాల్ యాదవ్, అజహారుద్దీన్ లాంటి వ్యక్తులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను ముందుండి నడిపించారు. బిసిసిఐ సపోర్ట్ లేకుండానే లాభాల బాట పట్టించారు. గ్రామీణ స్థాయిలో క్రికెట్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఒకరకంగా ఇప్పుడు బీసీసీఐ కింది స్థాయిలో టోర్నీలు నిర్వహిస్తోంది. కానీ ఈ ఆలోచనకు కొన్ని సంవత్సరాల క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రూపకల్పన చేసింది. విజయవంతంగా అమలు చేసింది. కాకపోతే నాటి రోజుల్లో ఈ స్థాయిలో అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పుడు అవకాశాలు అపారంగా ఉన్నాయి. ఆటగాళ్ల ప్రతిభను ఉపయోగించుకోవడానికి అనేక వేదికలున్నాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేతిలో ఉప్పల్ మైదానం ఉంది. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో హైదరాబాద్లో అత్యంత భారీ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల ఐపీఎల్లో చోటు చేసుకున్న ఉదంతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగుతున్న జగన్మోహన్ ను తెలంగాణ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఐపీఎల్ జరిగినప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ మధ్య టికెట్ల వివాదం ఏర్పడింది. సాధారణంగా హెచ్ సీ ఏ కు ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లను ఉచితంగా ఇస్తుంది. మ్యాచ్లు జరిగినప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం 10% టికెట్లను ముందుగానే ఇచ్చేస్తుంది. అవి కాకుండా మరో 10 శాతం టికెట్లు ఉచితంగా ఇవ్వాలని హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ డిమాండ్ చేశారు. దీనికి హైదరాబాద్ యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో ఆయన లక్నో జట్టుతో హైదరాబాద్ జట్టు తలపడుతున్న సందర్భంలో విఐపి గ్యాలరీలకు తాళం వేశారు. తమను టికెట్ల కోసం వేధించారని హైదరాబాద్ యాజమాన్యం ఒక లేఖ రూపంలో తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. అయితే ఈ వ్యవహారం జాతీయస్థాయిలో చర్చకు దారి తీయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే సిఐడి విచారణకు ఆదేశించారు…
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ యాజమాన్యం తమను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెట్టిన ఇబ్బందులను మెయిల్స్ రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఆ మెయిల్స్ లో హెచ్ సీ ఏ అధ్యక్షుడు జగన్మోహన్ వేధింపులను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. జగన్మోహన్ వేధింపులు నిజమని తేలింది. ఎప్పుడైతే సిఐడి అధికారులు రంగంలోకి దిగారో.. అప్పుడే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాళ్ల బేరానికి వచ్చింది. ఆ తర్వాత తమకు 10% టికెట్లు మాత్రమే చాలని.. మిగతావి కావాలి అనుకుంటే కొనుగోలు చేస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. అయితే ఈ విషయాన్ని తెలంగాణ సిఐడి పోలీసులు అందరితోనే వదిలేయలేదు. మరింత లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ ఒంటెత్తు పోకడలకు పోతున్నారని సిఐడి అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆయనను బుధవారం అరెస్ట్ చేశారు.
జగన్మోహన్ హెచ్ సీఏ అధ్యక్షుడి గా ఉన్నప్పటి నుంచి అనేక ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. జగన్మోహన్ కు గత ప్రభుత్వం అండదండలు ఉండడంతోనే ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యారని తెలుస్తోంది. తాజా ఉదంతం నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త వ్యక్తి అధ్యక్షుడయ్యే అవకాశం కనిపిస్తోంది. అందువల్లే సిఐడి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారని.. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇది జరిగిందని తెలుస్తోంది. జగన్మోహన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల్లోనూ భయం మొదలైంది. వారి అరెస్టు కూడా జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.