Harry Brooke : ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారి బ్రూక్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. పాకిస్తాన్ జట్టుతో ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో నాలుగు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ ఆడే జట్లకు చెందిన ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుపై ఈ స్థాయిలో బ్యాటింగ్ చేసిన దాఖలాలు లేవు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో బ్రూక్ 317 రన్స్ చేశాడు. ఈ క్రమంలో అనేక రికార్డులను సృష్టించాడు. పాకిస్తాన్ జట్టుపై అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు నాలుగు టెస్టులలో, 6 ఇన్నింగ్స్ లు ఆడిన బ్రూక్.. 130.83 యావరేజ్ తో 785 రన్స్ చేశాడు. ఇందులో ట్రిబుల్ సెంచరీ, నాలుగు శతకాలు ఉన్నాయి. పాక్ గడ్డపై హైయెస్ట్ యావరేజ్ కలిగిన బ్యాటర్ల లిస్టులో బ్రుక్ టాప్ స్థానంలో ఉన్నాడు.. ఆ తర్వాత సంజయ్ మంజ్రేకర్(94.83), వీరేంద్ర సెహ్వాగ్ (91.50), సమర వీర (90.42), గ్యారీ క్రిస్టన్ (88.16) మిగతా స్థానాలలో ఉన్నారు.. పాకిస్తాన్ జట్టుపై టెస్టులలో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా బ్రూక్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇది మాత్రమే కాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్రలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ లిస్టులో బ్రూక్ (317) 20వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టు తరుపున త్రిబుల్ సెంచరీ చేసిన ఆరవ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్లో రూట్, బ్రూక్ నాలుగో వికెట్ కు 454 రన్స్ జోడించారు. ఇంగ్లాండ్ జట్టు తరుపున టెస్ట్ క్రికెట్లో ఇదే హైయెస్ట్ పార్ట్ నర్ షిప్. ఇక సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో ఇది నాల్గవది.
నెంబర్ వన్ స్థానంలో..
సౌత్ ఆఫ్రికా జట్టుపై శ్రీలంక జట్టు 2006లో 624 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కుమార సంగక్కర, జయవర్ధనే 624 పరుగుల భాగస్వామ్యాన్ని నిలిపారు. ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యంగా రికార్డు సృష్టించింది. ఇక పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలుపు దిశగా వెళ్తోంది. రూట్ డబుల్ సెంచరీ చేశాడు..బ్రూక్ ట్రిబుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు పరుగుల వరద పారించింది. 492/3 తో నాలుగు రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ 150 ఓవర్లలో 823/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే నాలుగు రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు కేవలం 49 ఓవర్లలోనే 331 రన్స్ చేయడం విశేషం. ఫలితంగా ఆ జట్టుకు 267 రన్స్ లీడ్ లభించింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 208 రన్స్ చేసింది. జమాల్(52), అఫ్రిది (9) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 59 పరుగులు వెనుకబడి ఉంది. ఓటమి నుంచి తప్పించుకోవాలంటే పాకిస్తాన్ మిగతా మూడు వికెట్లతో ఈరోజు మొత్తం ఆటను కొనసాగించాల్సి ఉంది.