Anjani Kumar: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. అంజనీ కుమార్ ను డీవోపీటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేసుకుంటూ ఉండిపోయారు. గత ప్రభుత్వ పెద్దలకు అంజనీ కుమార్ అత్యంత సన్నిహితంగా ఉన్నారని ఆరోపణలను ఎదుర్కొన్నారు. నాటి అధికార పెద్దలకు కావాల్సిన పనులను అంజనీ కుమార్ చేశారని… అందువల్లే ఆయన తెలంగాణకు డిజిపి కూడా అయ్యారని మీడియాలో పెద్దపెట్టున వార్తలు వినిపించాయి. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం వరకు ఆయన తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా కొనసాగారు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో.. ఆయన వెంటనే తన డిజిపి పోస్ట్ కాపాడుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వినిపించాయి. ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడించక ముందే పుష్పగుచ్చం తీసుకొని నేరుగా రేవంత్ రెడ్డి ఇంటికి అంజని కుమార్ వెళ్లడం అప్పట్లో చర్చకు దారి తీసింది. దీంతో ఎన్నికల సంఘం ఆయనపై వేటు వేసింది. అయితే ఆయన తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినప్పుడు నాటి ప్రభుత్వ పెద్దల కోసం కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టారని.. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని చికాకు పెట్టారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అయితే రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంజనీ కుమార్ ను లూప్ లైన్ లో పెట్టారని తెలుస్తోంది.
హైదరాబాద్ కమిషనర్ గా పనిచేసినప్పుడు..
అంజని కుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసినప్పుడు.. అప్పట్లో వైసీపీ నేతలు డాటా చోరి పేరుతో ఫిర్యాదులు చేశారు. అయితే ఈ కేసులో ఎటువంటి సాక్షాలు లేకపోయినప్పటికీ అంజని కుమార్ అతిగా ప్రవర్తించారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. యాప్ ద్వారా ఓట్లు తొలగించారని నాడు అంజనీ కుమార్ ఒక మ్యాప్ గీసి మీడియా సమక్షంలో చూపించారు. కందుల నాగమణి, కందుల రంగారెడ్డి ఇద్దరు తండ్రి కూతుర్ల ఓట్లను ఆయన కేస్ స్టడీగా తీసుకున్నారు. ఆ తర్వాత ఓట్లు ఎలా మాయమయ్యాయనే విషయాన్ని వివరించారు. అంతేకాదు ఓట్ల జాబితాలో ఆన్ లైన్ లో సెర్చ్ చేసి.. ఆ ఐడి నెంబర్లకు సంబంధించి స్టేటస్ నాట్ ఫౌండ్ అని ఉందని.. అందువల్లే అలాంటి ఓట్లను తొలగించారని అంజని కుమార్ చెప్పారు. అయితే వారందరికీ హైదరాబాదులో ఓట్లు ఉండడం విశేషం. ఆ సందర్భంలో అంజనీ కుమార్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. అంజని కుమార్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించకుండా.. కేవలం సెర్చ్ చేసి ఈ విషయాన్ని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. నాడు అంజని కుమార్ వైసీపీ నాయకులు చెప్పినట్టుగానే చేశారని విమర్శలు వినిపించాయి. విజయవాడలో ఓట్లు పోయిన విషయాన్ని హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి అంజనీ కుమార్ మాట్లాడారు. కానీ ఆయన ఆంధ్రా పనిచేయాల్సింది పోయి.. హైదరాబాద్ లో పనిచేయడాన్ని టిడిపి నాయకులు తప్పు పట్టారు. సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు పెట్టారు. నాడు అంజని కుమార్ తోపాటు.. సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ కూడా తమను అనేక రకాలుగా వేధించారని టిడిపి నాయకులు ఆరోపించారు.. అయితే ఇప్పుడు అంజనీ కుమార్ ఆంధ్రాలో రిపోర్టు చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది? ఆయనను ఎలాంటి పోస్టులో నియమిస్తుంది? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.