Hardhik Pandya : పడి లేచిన వాడితో పోటీ ప్రమాదకరం.. దెబ్బలు తిన్నవాడితో.. పందెం అత్యంత అపాయకరం. ఈ సామెతలను నిజం చేసి చూపించాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. గత వన్డే వరల్డ్ కప్ లో అతడు గాయపడి టోర్నీ మధ్యలో నుంచి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కొద్దిరోజుల తర్వాత ఐపీఎల్ మొదలైంది. ఐపీఎల్ లోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఇచ్చాడు. గతంలో గుజరాత్ జట్టుకు అతడు సారథిగా వ్యవహరించేవాడు. కానీ ఈసారి గుజరాత్ నుంచి ముంబైకి మారాడు. ఇక అప్పటినుంచి రోహిత్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరికి మైదానంలో కూడా రోహిత్ అభిమానుల నుంచి ట్రోల్స్ భరించాడు. ఇదే సమయంలో తన భార్యకు విడాకులు ఇచ్చాడని వార్తలు రావడంతో హార్దిక్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది..
ఇన్ని విమర్శల మధ్యే హార్దిక్ టి20 వరల్డ్ కప్ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి అతడి ఎంపిక పట్ల చాలామంది తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇందులో టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే వాటన్నింటినీ మనసులో పెట్టుకున్న హార్దిక్.. తన ఆట తీరుతోనే సమాధానం చెప్పాడు. బౌలింగ్ లో అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. ఇవన్నీ కూడా టీం ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడే చేశాడు.. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ వేసి టీమ్ ఇండియాను గెలిపించాడు. కేవలం 8 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇలా టి20 వరల్డ్ కప్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేయడంతో హార్దిక్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఏకంగా నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.
టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ జట్లు, ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ఆల్ రౌండర్ కేటగిరిలో హార్దిక్ పాండ్యా నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు… రెండు స్థానాలు మెరుగుపరచుకొని.. శ్రీలంక ఆటగాడు హసరంగ (222 పాయింట్లు) తో కలసి అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు.. ఇదే క్రమంలో ఆల్ రౌండర్ ల కేటగిరిలో టీమిండియా తరఫున తొలి స్థానాన్ని దక్కించుకున్న ఆటగాడిగా హార్దిక్ రికార్డ్ సృష్టించాడు. హార్దిక్ తర్వాత మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా), సికిందర్ రాజా (జింబాబ్వే), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఒక్కోస్థానం మెరుగుపరచుకొని వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబి 4 స్థానాలు కోల్పోయి, ఆరవ స్థానానికి పరిమితమయ్యాడు.
టి20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా ఆరు ఇన్నింగ్స్ లలో 151.57 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 144 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్థ సెంచరీ ఉంది. 8 మ్యాచ్లలో 7.64 ఎకనామి రేటుతో 11 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో (3/20) అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
మిగతా ఆటగాళ్ల విషయానికొస్తే దక్షిణాఫ్రికా బౌలర్ నోకియా రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ ఏడో స్థానంలో, కులదీప్ యాదవ్ 8వ స్థానంలో కొనసాగుతున్నారు.. బుమ్రా 12 స్థానాలు ఏగబాకి 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. 2020 చివరి నుంచి లెక్కిస్తే బుమ్రా కిదే ఉత్తమ ర్యాంకు. ఇక టి20 వరల్డ్ కప్ లో 17 వికెట్లు పడగొట్టిన అర్ష్ దీప్ సింగ్ 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. టి20 కెరియర్లో అతడికి ఇదే ఉత్తమ ర్యాంకు.