YS Jagan : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది మాజీ సీఎం జగన్ పరిస్థితి.ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకు పోయారు జగన్. ఇప్పుడు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. కేసుల విచారణకు జగన్ హాజరు తప్పనిసరిగా మారేలా ఉంది. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ గత ఐదేళ్లుగా నత్తనడకన సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు ముందు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కేసుల రోజువారి విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు రోజువారి విచారణ చేపట్టాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
ఎన్నికలకు ముందు హరి రామ జోగయ్య జనసేనకు అనుకూలంగా ఉండేవారు. పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచేవారు. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్ల కోసం ఆయన నిరాహార దీక్ష సైతం చేపట్టారు. అప్పట్లో పవన్ వెళ్లి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో హరి రామ జోగయ్య లేనిపోని షరతులు పెట్టారు. లేఖలతో పవన్ కళ్యాణ్ కు చికాకు పెట్టారు. దీంతో పొత్తు అంశం పక్కకు వెళ్లి వైసీపీకి ప్రయోజనం చేకూరేలా ప్రవర్తిస్తున్నారని హరి రామ జోగయ్య విషయంలో.. పవన్ పట్టించుకోవడం మానేశారు. అయితే అంతకంటే ముందే హరి రామ జోగయ్య కోర్టులో పిటిషన్ వేశారు. జగన్ పై నమోదైన సిబిఐ, ఈడీ కేసుల రోజువారి విచారణ చేపట్టాలని కోరారు. హైదరాబాద్ సిపిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రత్యేక పిల్ వేశారు. సిబిఐ ఈడి కేసులు లేని నేతలను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని.. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో నిందితుడైన జగన్ వరుస పిటిషన్లు వేసి విచారణను సాగనివ్వడం లేదని ఆయన ఆరోపణ చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా సాగడం లేదని.. ఇతర రాష్ట్రాలకు ఈ కేసులను బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిబిఐ విచారణ జరిపి కారణం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది కూడా. అయితే వరుసగా వివిధ రకాల పిటిషన్లు నిందితులు వేయడంతోనే విచారణలో జాప్యం జరుగుతోందని సిబిఐ స్పష్టతనిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో క్విడ్ ప్రోకో ఆరోపణలతో మొత్తం 20 ఛార్జ్ షీట్లను జగన్ పై సిబిఐ, ఇది దాఖలు చేశాయి. ఈ కేసులపై సిపిఐ కోర్టులో 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ చార్జి షీట్లనుంచి తప్పించాలని జగన్, విజయసాయిరెడ్డి ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పు వెల్లడి కాలేదు. తీర్పు చెప్పాల్సిన రోజు జడ్జి బదిలీ కావడంతోనే ఆ కేసు వాదనలు కూడా సిబిఐ జడ్జి మళ్ళీ వింటున్నారు. ఇటువంటి తరుణంలో రోజువారి విచారణలు జరగాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం.