Adelaide Pink Ball Test : ఈ సిరీస్లో పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరిగింది. ఈ టెస్టులో భారత్ 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా ఓపెన్ యశస్వి జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ 100 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. బుమ్రా 8 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ విజయం ద్వారా టీమిండియా తన మీద ఉన్న ఒత్తిడిని మొత్తం తగ్గించుకుంది. మరోవైపు హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా దారుణంగా విఫలమైంది. దీంతో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా పై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. గాయం వల్ల రెండవ టెస్టుకు ఆస్ట్రేలియా కీలకమైన బౌలర్ హేజిల్ వుడ్ దూరమయ్యాడు. అతడికి గాయం కావడంతో సిరీస్ నుంచి మినహాయించామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అడి లైడ్ పిచ్ క్యూరేటర్ డామియన్ హగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు..” ఈ మైదానం స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తుంది. ఈ మైదానంపై ఆరు మిల్లీమీటర్ల పరిమాణంలో పచ్చిక ఉంది. ప్రారంభంలో పేస్ బౌలింగ్ కు సహకరిస్తుంది. డే అండ్ నైట్ విధానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి గులాబీ బాల్ ను ఎదుర్కోవడం కాస్త కష్టం. ఈ మైదానం అటు బ్యాటర్లకు.. ఇటు బౌలర్లకు సపోర్టు చేస్తుందని” హగ్ పేర్కొన్నాడు..
కుదురుకుంటే..
గులాబీ బంతి పాతబడే వరకు ఆటగాళ్లు కుదురుకోవాలి. ఆ తర్వాత పరుగులు సులభంగా రాబట్టవచ్చు. ఈ మైదానంపై స్పిన్ బౌలర్లు సత్తా చాటుతారు. గతంలో జరిగిన మ్యాచ్ లు ఇవే ఉదంతాలను నిరూపించాయి. ఈ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కచ్చితంగా ప్రధానమైన స్పిన్ బౌలర్ జట్టులో ఉండాలి. మ్యాచ్ మొదట్లో పేస్ బౌలర్లు సత్తా చాటుతారు. ఆ తర్వాత స్పిన్ బౌలర్లు అదరగొడతారు. రాత్రిపూట స్పిన్ బౌలర్లతో బ్యాటర్లకు ప్రమాదం పొంచి ఉంటుంది. 2020లో ఇదే వేదికపై జరిగిన మ్యాచ్లో భారత్ 36 పరుగులకే కుప్పకూలింది. ఐతే ఈసారి భారత్ అలా ఆడకపోవచ్చని.. ఆస్ట్రేలియా పైనే ఒత్తిడి ఉండే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్ లో టీమిండియా లోకి రోహిత్, గిల్ ఎంట్రీ ఇస్తున్నారు. దేవదత్, ధృవ్ రిజర్వ్ బెంచ్ కు పరిమితం కానున్నారు. భారత జట్టు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ను ఈ మ్యాచ్ లోనూ రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయనున్నారు. వాషింగ్టన్ సుందర్ ను ప్రధాన స్పిన్నర్ గా బరిలోకి దింపనున్నారు. ఆస్ట్రేలియా జట్టులో హేజిల్ వుడ్ కు గాయం కావడంతో అతడి స్థానంలో బోలాండ్ కు అవకాశం ఇచ్చారు.