Gautam Gambhir Cricket Success: గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా మాజీ ఆటగాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్.. ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే విమర్శలు, వివాదాలు, విజయాలతో కూడిన ఒక రోలర్‌కోస్టర్ ప్రయాణాన్ని అనుభవించారు. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై 0–3 టెస్టు సిరీస్ ఓటమి, ఆస్ట్రేలియా పర్యటనలో పరాజయం, సీనియర్ ఆటగాళ్లైన అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ల వివాదం గంభీర్‌పై తీవ్ర విమర్శలను తెచ్చిపెట్టాయి. అయితే, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో 2–2 డ్రాతో జట్టు అద్భుత ప్రదర్శన చేయడం గంభీర్ వ్యూహాత్మక నిర్ణయాలను హైలైట్ చేసింది.
Also Read: విరాట్ తో బంధంపై ఎంఎస్ ధోని సంచలన కామెంట్స్
సవాల్‌తో మొదలు..
2024లో టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్, తన మొదటి సిరీస్‌లోనే న్యూజిలాండ్‌తో 0–3 టెస్టు సిరీస్ ఓటమితో షాక్‌కు గురయ్యాడు. భారతదేశంలో దశాబ్ద కాలంగా టెస్టు సిరీస్ ఓటమి లేని రికార్డును ఈ ఓటమి భగ్నం చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా టెస్టుల్లో జట్టు పరాజయం పొందడంతో గంభీర్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్‌లు ముఖ్యంగా అశ్విన్ ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో, రోహిత్, కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు గంభీర్ నిర్ణయాలపై వివాదాన్ని రేకెత్తించాయి. అభిమానులు, విశ్లేషకులు ఈ రిటైర్మెంట్‌ల వెనుక గంభీర్ ఒత్తిడి ఉందని ఆరోపించారు, ఇది ఆయనపై ఒత్తిడిని మరింత పెంచింది.
ఇంగ్లండ్ టూర్‌లో సక్సెజ్..
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ గంభీర్ కోచింగ్ కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 2–2 డ్రాతో సిరీస్ సమం కావడం, ఇంగ్లాండ్ యొక్క బాజ్‌బాల్ శైలిని ఎదుర్కొని భారత జట్టు చూపిన పోరాట పటిమ గంభీర్ వ్యూహాత్మక నిర్ణయాలను హైలైట్ చేసింది. యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను ఎంచుకోవడం, కుల్దీప్ యాదవ్‌కు బదులుగా సుందర్‌కు అవకాశం ఇవ్వడం వంటి నిర్ణయాలు నాలుగో టెస్టులో డ్రా చివరి టెస్టులో విజయానికి కీలకమయ్యాయి. గంభీర్ దూకుడు వ్యూహం యువ ఆటగాళ్లపై నమ్మకం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ సిరీస్ విజయం గంభీర్‌పై విమర్శలను తగ్గించి, ఆయన కోచింగ్ సామర్థ్యంపై ప్రశంసలను తెచ్చిపెట్టింది.
Also Read: గెలుపు క్షణం.. గంభీర్ ఆనందానికి అవధుల్లేవ్.. గూస్ బంప్స్ వీడియో
యువ ఆటగాళ్లపై ఫోకస్..
గంభీర్ కోచింగ్ శైలి యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం, స్టార్ సంస్కృతిని తొలగించడం. ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక చేయడంపై కేంద్రీకృతమై ఉంది. శుభ్‌మన్ గిల్‌ను టెస్టు కెప్టెన్‌గా నియమించడం, యువ ఆటగాళ్లైన సుందర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్‌లకు అవకాశాలు కల్పించడం గంభీర్ దీర్ఘకాలిక విజన్‌ను సూచిస్తుంది. జట్టు వర్గాల ప్రకారం, గంభీర్ కఠిన నిబంధనలను అమలు చేస్తూ, ఆటగాళ్ల ఫిట్‌నెస్, ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకున్నాడు. పర్యటనల్లో కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం, ఆటగాళ్లు తమ ఇష్టానుసారం మ్యాచ్‌లను ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం వంటి నిర్ణయాలు జట్టు క్రమశిక్షణను పెంచాయి. ఈ విధానం అశ్విన్, రోహిత్, మరియు కోహ్లీ రిటైర్మెంట్‌ల వివాదానికి కారణమైనప్పటికీ, యువ ఆటగాళ్లకు అవకాశాలు పెరిగాయి.