https://oktelugu.com/

Champions Trophy : భారత్ చేతిలో ఓడినా పాక్‎కు సెమీ ఫైనల్ ఆశలు.. కాకపోతే అలా చేస్తేనే

Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్(Pakistan) వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. పాకిస్తాన్ జట్టును భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. అంతకుముందు, ఆతిథ్య జట్టు పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Written By: , Updated On : February 24, 2025 / 08:32 AM IST
Champions Trophy

Champions Trophy

Follow us on

Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్(Pakistan) వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. పాకిస్తాన్ జట్టును భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. అంతకుముందు, ఆతిథ్య జట్టు పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మళ్లీ ఇప్పుడు భారత జట్టు మీద ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) నుండి నిష్క్రమించిందా అనే ప్రశ్నలు కొందరిలో తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఇంకా ఎలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని కొందరు అడుగుతున్నారు. ఫైనల్-4 జట్లలోకి రావడానికి ఇతర జట్లపై ఎలా ఆధారపడాల్సి వస్తుందో తెలుసుకుందాం.

పాకిస్తాన్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే ముందుగా గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌ను ఓడించాల్సి ఉంటుంది. నెట్ రన్ రేట్‌ను దృష్టిలో ఉంచుకుని.. పాకిస్తాన్ బంగ్లాదేశ్‌పై భారీ విజయాన్ని నమోదు చేయాలి. దీంతో పాటు మహ్మద్ రిజ్వాన్, అతడి జట్టు సభ్యులు న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ రెండూ గెలవాలని కోరుకోవాల్సి ఉంటుంది.

న్యూజిలాండ్ జట్టు తదుపరి మ్యాచ్‌లలో భారత్, బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతే.. మరోవైపు, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ను ఓడిస్తే, పాయింట్ల పరంగా మూడు జట్లు సమానంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో సెమీ-ఫైనల్ బెర్త్ నికర రన్-రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం, పాకిస్తాన్ నెట్ రన్-రేట్ -1.087.. కాబట్టి వారికి బంగ్లాదేశ్‌ను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది.

గ్రూప్ A లో మిగిలిన మ్యాచ్‌లు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ Aలో భారతదేశం, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ గ్రూప్‌లో మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇంకా మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 24న బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఈ గ్రూప్‌లోని చివరి మ్యాచ్ మార్చి 2న భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది.