AUS Vs ENG Ashes: యాషెస్ సిరీస్ అంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేని ఆసక్తి ఉంటుంది. అటు ఆస్ట్రేలియా, ఇటు ఇంగ్లాండ్ ప్లేయర్లు దూకుడుగా ఆడుతుంటారు. మైదానంలో మాటలతో యుద్ధం సాగిస్తుంటారు. నువ్వా నేనా అన్నట్టుగా ఆట తీరు ప్రదర్శిస్తుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు పోరాటాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తోంది. బజ్ బాల్ ఆటలో పడి టెస్ట్ క్రికెట్ ఎలా ఆడాలో విస్మరించినట్టు అనిపిస్తోంది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న “బూడిద పోరాటంలో” ఇప్పటికే ఆతిధ్య జట్టు రెండు టెస్టులు గెలిచింది. ప్రస్తుతం అడిలైడ్ వేదికగా మూడవ టెస్ట్ ఆడుతోంది. ఈ టెస్టులో కూడా ఇంగ్లాండ్ జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టును 371 పరుగులకు ఇంగ్లాండ్ చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఈ కథనం రాసే సమయం వరకు 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో స్టోక్స్(0), బ్రూక్(11) ఉన్నారు.
ఆస్ట్రేలియా ప్లేయర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసినచోట.. ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు. వికెట్ కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. బౌలింగ్లో కమిన్స్ వైవిధ్యాన్ని చూపిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది.. ఎన్నో ఆశలు పెట్టుకున్న జాక్ క్రావ్ లీ(9), డకెట్(29), పోప్(3), రూట్(19) నిరాశపరిచారు. కెప్టెన్ కమిన్స్, లయన్ చెరి రెండు వికెట్లు సాధించారు.
ఇప్పటికే రెండు టెస్టులను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు.. మూడో టెస్టుకు జట్టులో చాలా వరకు మార్పులు తీసుకొచ్చింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో రూట్ అద్భుతంగా ఆడతాడని కెప్టెన్ స్టోక్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ, రూట్ ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోయాడు. రూట్ ఔట్ అయిన తర్వాత కెప్టెన్ స్టోక్స్ తీవ్రమైన అసహనంతో కనిపించాడు. ఎప్పుడైతే రూట్ అవుట్ అయ్యాడో.. ఆస్ట్రేలియా బౌలర్లు మరింత పట్టు బిగించారు. పదునైన బంతులు వేస్తూ ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లో ఓటమిని తప్పించుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి.