ENG vs IND: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత.. రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్లు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2025-27 లో భాగంగా ఆంగ్ల జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
మరో రెండు రోజుల్లో ఈ టెస్ట్ సిరీస్ మొదలవుతుంది.. సాధారణంగా ఇంగ్లీష్ గడ్డ అనగానే బజ్ బాల్ క్రికెట్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే తమ మైదానంపై ఆంగ్ల ప్లేయర్లు వీరొచితమైన బ్యాటింగ్ చేస్తారు. జో రూట్, డకెట్, పోప్, స్టోక్స్, జాక్ క్రాలీ, స్మిత్ వంటివారు అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లు. తమ బౌలర్లు సత్తా చూపించిన మైదానంపై వీరు బ్యాట్ తో అదరగొడతారు. నిదానంగా సాగే సుదీర్ఘ ఫార్మాట్లో బజ్ బాల్ విధానాన్ని ప్రవేశపెట్టిన వీరు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. బౌలర్లు ఎవరనేది చూడకుండా బీభత్సంగా బ్యాటింగ్ చేస్తారు. అనేక సందర్భాలలో బజ్బాల్ విధానం విఫలమైనప్పటికీ వీరు దాని నుంచి దూరం జరగడానికి ఇష్టపడటం లేదు. మరోవైపు సొంత మైదానంలో బజ్ బాల్ విధానంలోనే బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ బ్యాటర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారంటే.. వారి మనోగతం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..
Also Read: IND Vs ENG: భారత్ కు మూడు.. ఇంగ్లాండ్ కు మిగిలింది గుండు సున్నా..
సత్తా చూపించాల్సిందే..
విరాట్ కోహ్లీ, రోహిత్ లేకుండానే టీమ్ ఇండియా ఇంగ్లీష్ గడ్డ పై టెస్ట్ సిరీస్ ఆడుతోంది. గిల్ నాయకత్వంలో భారత జట్టు ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వంటి వారు సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. భారత బ్యాటింగ్ వీరి ముగ్గురి మీదే ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. మిగతా ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. వీరు ముగ్గురు బలమైన పునాదులు వేస్తేనే.. మిగతా ప్లేయర్లకు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు బౌలింగ్ భాగంలో ఇంగ్లీష్ గడ్డమీద జస్ ప్రీత్ బుమ్రా 9 టెస్టులు ఆడి.. 27 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం అతడి సామర్థ్యం సక్రమంగానే ఉన్నది. భారత జట్టు బౌలింగ్ దళాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఇతడి మీద ఉంది. మరోవైపు సిరాజ్ ఇటీవల అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇంగ్లీష్ జట్టుమీద ఆరు టెస్టులు ఆడి 23 వికెట్లు సాధించాడు సిరాజ్. ఈ క్రమంలో అతడు తన పూర్వపు ఫామ్ అందుకోవాల్సి ఉంది. బుమ్రా కు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. శార్దుల్ ఠాకూర్ కు కూడా పిలుపు వచ్చింది. అతడు ఇంగ్లీష్ గడ్డమీద నాలుగు టెస్టులు ఆడి పది వికెట్లు సాధించాడు. అతడు కూడా ఈ సిరీస్ లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అర్ష్ దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణకు అవకాశం దక్కితే.. వారు కూడా అదరగొట్టాల్సిన అవసరం ఉంది.. ఇక ఇంగ్లీష్ గడ్డమీద రవీంద్ర జడేజాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇంగ్లీష్ గడ్డమీద జడేజా 12 టెస్టులు ఆడి 27 వికెట్లు సాధించాడు. అతడికి తుది జట్టులో అవకాశం లభించడం ఖాయం కాబట్టి.. అతడు గనుక తన మాయజాలాన్ని ప్రదర్శిస్తే భారత జట్టుకు తిరుగు ఉండదు. రవీంద్ర జడేజాకు వాషింగ్టన్ సుందర్ కనుక తోడైతే.. భారత జట్టు స్పిన్ విభాగం మరింత బలోపేతం అవుతుంది.