MIM in AP: ఏపీ ఫై మజ్లిస్ పార్టీ( Majlis) దృష్టి పెట్టిందా? వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయనుందా? ముస్లిం ప్రభావిత నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట కర్నూలులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భారీ సమావేశం ఏర్పాటు చేశారు. వేలాదిగా ముస్లింలు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఏపీలో ఎంఐఎం విస్తరణ పై వారితో చర్చించారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. చంద్రబాబు నాయకత్వంపై కూడా కొన్ని రకాల కామెంట్స్ చేశారు. తద్వారా ఏపీ రాజకీయాల్లో ఎంఐఎం ప్రవేశిస్తుందని సంకేతాలు ఇచ్చారు. అయితే మజ్లీస్ పార్టీ ఎంట్రీ తో ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ సీన్ మారే అవకాశం ఉంది. అయితే ఎంఐఎం పార్టీ ప్రవేశంతో ఏ పార్టీకి నష్టం జరుగుతుందా అన్న చర్చ ఏపీలో మొదలైంది.
ఆ నియోజకవర్గాలపై ఫోకస్..
రాష్ట్రవ్యాప్తంగా ఓ 20 నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా అధికం. ప్రధానంగా రాయలసీమ( Rayalaseema ) జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్దేశించే స్థితిలో ముస్లింలు ఉన్నారు. అటువంటి నియోజకవర్గాలపై మజ్లిస్ పార్టీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీని జాతీయస్థాయిలో విస్తరించేందుకు ఓవైసీ సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం కు దక్కాయి. కానీ పార్లమెంట్ సీట్లు మాత్రం పెరగడం లేదు. ఈ తరుణంలో ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఏపీపై దృష్టి పెట్టారు ఓవైసీ. కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం విజయం.. బీజేపీకి షాక్
ఆది నుంచి టిడిపికి వ్యతిరేకం..
ఏపీలో ఆది నుంచి ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలుస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో భాగ్యనగరంలో ఎంఐఎం( MIM) ప్రభావం చూపేది. మిగతా ప్రాంతాల్లో ముస్లింలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. అయితే బిజెపితో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగారు ముస్లింలు. బిజెపితో పొత్తు తెగదెంపులు చేసుకున్న క్రమంలో కొంతవరకు టిడిపికి అండగా నిలిచారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ముస్లింలు అటువైపు మొగ్గు చూపారు. 2014, 2019 ఎన్నికల్లో ముస్లింలు పూర్తిస్థాయిలో వైసిపి వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ.. ప్రభావిత నియోజకవర్గాల్లో గెలుపు పొందుతూ వచ్చింది. 2024 లో మాత్రం ముస్లింలు విడిపోయారు. దాని ఫలితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. ఇప్పుడు ఎంఐఎం వస్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం అన్న విశ్లేషణలు ఉన్నాయి.
Also Read: Hyderabad Areas Names History: బంజారాహిల్స్ టు మలక్ పేట్.. అసలు ఈ పేర్లు ఎలా పుట్టాయి..? హైదరాబాద్ ప్రాంతాల పేర్ల వెనుక చరిత్ర!
వైసిపి పై మారిన అభిప్రాయం..
తెలుగుదేశం( Telugu Desam), జనసేనలు బిజెపితో కలిసి ప్రయాణం చేస్తుండడంతో ముస్లింలు ఆ రెండు పార్టీలకు దూరమయ్యారు. ఆపై వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో కూటమి పార్టీలు అంటేనే మండి పడిపోతున్నారు ముస్లింలు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఈ బిల్లుపై వ్యతిరేకంగా మాట్లాడడం, భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ముస్లింల అభిప్రాయం మారింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎంఐఎం విస్తరణకు ఓవైసీ గట్టి ప్రయత్నాలు చేస్తుండడంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం రేగింది. అయితే వచ్చే ఎన్నికల నాటి పరిస్థితులకు అనుగుణంగా ఎంఐఎంతో వైసిపి పొత్తు పెట్టుకునే పరిస్థితి వస్తుందని కూడా అంచనాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.