Rohit Sharma: హై హై నాయకా.. మ్యాచ్ చేజారిన ప్రతిసారీ కొత్త రోహిత్ పుట్టుకొచ్చాడు..

టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ.. ఇదే సీన్ రిపీట్ అవుతుందా.. రోహిత్ ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోలేడా.. అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అయ్యాయి. చివరికి ఫైనల్ మ్యాచ్లో అతడు 9 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 30, 2024 5:40 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma: “గత టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో దారుణమైన ఓటమి.. కన్నీరు పెట్టాడు.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి.. ఈసారి కూడా కన్నీటి పర్యంతమయ్యాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్.. ఈసారి కూడా పరాజయం.. మళ్లీ గుండె బరువెక్కేలా ఏడ్చాడు”

ఫైనల్ వెళ్లడం.. ఓడిపోవడం.. ఏడవడం.. సర్వసాధారణమైంది..

టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ.. ఇదే సీన్ రిపీట్ అవుతుందా.. రోహిత్ ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోలేడా.. అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అయ్యాయి. చివరికి ఫైనల్ మ్యాచ్లో అతడు 9 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. విరాట్ వీరొచిత ఇన్నింగ్స్ వల్ల టీమిండియా చివరి వరకు ఆడింది. 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో హెండ్రిక్స్, మార్క్రం వెంటవెంటనే అవుటయ్యారు.. ఇక భారత్ విజయం సాధించినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ స్టబ్స్, డికాక్, క్లాసెన్.. భారత బౌలర్లకు ఎదురొడ్డారు. స్పిన్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా క్లాసెన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఇండియాకు ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు.

కానీ క్లిష్ట పరిస్థితిలో రోహిత్ హార్దిక్ పాండ్యాకు బంతి ఇచ్చాడు. క్లాసెన్ ను బోల్తా కొట్టించాడు. అంతకుముందు డికాక్ ను అర్ష్ దీప్, స్టబ్స్ ను అక్షర్ పటేల్, క్లాసెన్ ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశారు.. వాస్తవానికి ఈ ముగ్గురు ఆటగాళ్లు దూకుడుగా ఆడారు.. సౌత్ ఆఫ్రికా ను గెలుపు తీరాలకు తీసుకెళ్ళేందుకు తీవ్రంగా శ్రమించారు. వీరు మైదానంలో ఉన్నప్పుడు టీమిండియాకు గెలుపుపై ఏమాత్రం నమ్మకం లేదు. ఇక ఎలాగూ టీమిండియా గెలవగానే ఉద్దేశంతో అభిమానులు టీవీలు కట్టేసేందుకు ప్రయత్నిస్తుండగా.. వారిలో కొత్త ఆశలు చిగురింపజేశాడు రోహిత్ శర్మ.. “దేశం కోసం ఆడుతున్న సమయంలో ఇవన్నీ సర్వసాధారణమే.. మా కష్టాన్ని గుర్తించండి అంటూ”సంకేతాలు వదిలాడు. రోహిత్ లో ఉన్న ఉన్నఆ ఆశావహ దృక్పథమే టీమిండియాను విజేతను చేసింది.

టీమిండియా 34/3 వద్ద ఉన్నప్పుడు విరాట్ “ప్రజెన్స్ ఆఫ్ మైండ్” విధానంలో ఆడాడు. అతడికి జోడిగా ఉన్న అక్షర్ పటేల్ ను పంపించాడు రోహిత్. ఆచి తూచి ఆడినప్పటికీ.. స్కోర్ బోర్డును ఎక్కడా కూడా 7 పరుగులకు తగ్గకుండా ముందుకు నడిపించాడు విరాట్. అక్షర్ పెవిలియన్ చేరుకున్నప్పటికీ దూబే తో కలిసి దూకుడుగా ఆడాడు. చివరి వరకు రన్ రేట్ 8 కి తగ్గకుండా చూసుకున్నాడు. బార్బడోస్ వంటి మైదానాలపై ఈ రన్ రేట్ కచ్చితంగా విజయాన్ని ఇస్తుంది. విరాట్ 50 పరుగులు పూర్తి చేసిన తర్వాత ధాటిగా ఆడాడు. ఎడాపెడా షాట్లు కొట్టాడు. ఫలితంగా టీమ్ ఇండియా స్కోర్ వేగంగా దూసుకెళ్లింది. చివరికి 176 పరుగులు చేయడంతో అభిమానులు కూడా 34/3తో నిలిచిన జట్టు ఇంత స్కోర్ చేసిందా అనుకున్నారు. వాస్తవానికి ఈ మైదానంలో ఈ వికెట్ పై సగటు పరుగులు 159. కానీ భారత్ 176 పరుగులు చేసింది. ఒకవేళ రోహిత్ కనక అక్షర్ బదులు శివం దూబే ను పంపితే ఇంత స్కోర్ చేసి ఉండేది కాదు..

ఇక బౌలింగ్ విషయంలో బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అయితే స్పిన్నర్లు కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చారు. స్టబ్స్, క్లాసెన్, క్వింటన్ డికాక్ స్పిన్నర్ల బౌలింగ్ లోనే దూకుడుగా ఆడారు. ముఖ్యంగా క్లాసెన్ అక్షర పటేల్ వేసిన 15 ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా విజయానికి అవసరమైన రన్ రేట్ ఆరుకు చేరుకుంది. అప్పటికి సౌత్ ఆఫ్రికా చేతిలో ఆరు వికెట్లు ఉండడంతో.. కచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో పంత్ తన కాలికి పట్టి వేసుకోవడానికి కొంచెం సమయం తీసుకోవడంతో మ్యాచ్ కాసేపు ఆగింది. అయితే అప్పటికే భారత స్పిన్నర్లు తొమ్మిది ఓవర్లు వేసి దాదాపు 106 పరుగులు ఇచ్చుకున్నారు.

అంతటి క్లిష్ట పరిస్థితుల్లో రన్ రేట్ ను కచ్చితంగా అడ్డుకోవాలని.. అలా అయితేనే మ్యాచ్ భారత్ వైపు ఉంటుందని అంచనా వేసుకున్నాడు రోహిత్ శర్మ. దీంతో బుమ్రా చేతికి బంతి ఇచ్చాడు. 16 ఓవర్లో బుమ్రా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 17 ఓవర్లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రోహిత్ బంతి అందించాడు. ఆ ఓవర్ తొలి బంతికే ప్రమాదకరమైన క్లాసెన్ ను హార్దిక్ అవుట్ చేశాడు. పైగా ఆ ఓవర్ లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు పై ఒత్తిడి పెరిగిపోయింది… హార్దిక్ ఓవర్ ముగిసిన తర్వాత.. బుమ్రా ను రోహిత్ మరోసారి దక్షిణాఫ్రికా పై ప్రయోగించాడు. దీంతో బుమ్రా జాన్సన్ పై పదునైన బంతులు సంధించాడు. అద్భుతమైన ఇన్ స్వింగర్ వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతేకాదు ఆ ఓవర్ లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అప్పటికి దక్షిణాఫ్రికా విజయ సమీకరణం 12 బంతుల్లో 20 పరుగులకు చేరుకుంది. ఇక 19వ ఓవర్ అర్ష్ దీప్ సింగ్ కు ఇచ్చాడు. అర్ష్ దీప్ సింగ్ కేశవ్ మహారాజ్ ను టార్గెట్ చేస్తూ బంతులు వేశాడు. మిల్లర్ కూడా ధాటిగా ఆడకుండా ఉండేందుకు.. లోపలికి వచ్చే బంతులు విసిరాడు . దీంతో 19 ఓవర్ లో కూడా దక్షిణాఫ్రికా నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇక చివరి ఓవర్ ను హార్దిక్ పాండ్యా తీవ్ర ఒత్తిడిని భరించుకుంటూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతి ఫుల్ టాస్ వేయగా.. మిల్లర్ భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ వద్ద మిల్లీమీటర్ల దూరంలోనే సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ అందుకున్నాడు. తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం బంతిని గాల్లో ఎగరవేసి.. బౌండరీ లైన్ క్రాస్ చేశాడు. ఆ తర్వాత మైదానంలోకి ఎగురుతూ క్యాచ్ అందుకున్నాడు. ఈ రిలే క్యాచ్ ద్వారా మ్యాచ్ భారత్ వైపు వచ్చింది. ఆ తర్వాత బంతికి ఒక ఫోర్ కొట్టినప్పటికీ.. ఐదో బంతిని హార్దిక్ హాఫ్ స్టంప్ అవతల విసిరాడు. భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన రబాడా సూర్య కుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అయితే ఇంతటి ఒత్తిడి సమయంలోనూ రోహిత్ చాలా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. చివరి వరకు పోరాడే స్ఫూర్తిని ప్రతి ఆటగాడిలో కలిగించాడు. ఫైనల్ మ్యాచ్లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి కొత్త రోహిత్ పుట్టుకొచ్చాడు. టీమిండియా కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.