Ajinkya Rahane: ఈ ఐపీఎల్ లో అజింక్య రహనే అదరగొడుతున్నాడు. ఒకప్పుడు జిడ్డు బ్యాటింగ్ తో టెస్ట్ ప్లేయర్ గా పేరుగాంచిన రహనే.. ఇప్పుడు అరవీర భయంకరమైన హిట్టింగ్ చేస్తూ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నది ఒకప్పటి రహానేనా..? అన్నట్టుగా ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఈ మార్పుకు కారణం ఏమిటన్న ప్రశ్న అభిమానులను తొలి చేస్తోంది.
ఐపీఎల్ 16వ ఎడిషన్ లో అజింక్య రహనే విజృంభిస్తున్నాడు. పూనకం వచ్చినట్లు ప్రతి మ్యాచ్ లోను బాదేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే బాధడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఒకప్పుడు సింగిల్స్, డబుల్స్ కు మాత్రమే పరిమితమై పరుగులు చేసిన ఈ ఆటగాడు.. ప్రస్తుతం ఫోర్లు, సిక్సులతో అదరగొట్టేస్తున్నాడు. టెస్ట్ ప్లేయర్ కాస్త.. టి20 స్పెషలిస్ట్ గా మారిపోయాడు. ఐపీఎల్ లో ఇప్పుడు అందరి దృష్టి అజంక్య రహానే ఆట పైనే ఉందంటే.. ఏ స్థాయిలో ప్రదర్శన చేస్తున్నాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఫుల్ మజానిస్తున్న ఐపీఎల్..
ఈ ఏడాది ఐపీఎల్ చూస్తుంటే ఫుల్ మజా వస్తోంది. సీజన్ ప్రారంభానికి ముందు అస్సలు చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు. కానీ గడిచిన వారం రోజుల నుంచి పూర్తిగా సీనే మారిపోయింది. ఎంతలా అంటే ప్రతి మ్యాచ్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ అయితే చాప కింద నీరులా హ్యాట్రిక్ విజయాలతో పాయింట్లు పట్టికలో టాప్ లోకి వెళ్లిపోయింది. అయితే చెన్నై గెలవడానికి మెయిన్ కారణం అందరూ ధోని కెప్టెన్సీ అంటారు. కానీ ఈ సీజన్ లో చెన్నై విజయాలు వెనక అజంక్య రహానే ఉన్నాడన్న విషయాన్ని అతి కొద్ది మంది మాత్రమే గుర్తిస్తున్నారు. గతానికి భిన్నంగా అరవీర భయంకరమైన బ్యాటింగ్ తో విజృంభిస్తున్నాడు ఈ ప్లేయర్. తనని అవమానించిన ప్రతి ఒక్కరికి బ్యాటతోనే సమాధానం చెబుతున్నాడు. మరీ చెప్పాలంటే వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తున్నాడు.
ట్రెండ్ కు తగ్గట్టు మారలేకపోవడంతో ఇబ్బంది..
అజంక్య రహానే గురించి టీమిండియా ఫ్యాన్స్, క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి టెక్నిక్ ఉన్న బ్యాటర్. కాకపోతే ట్రెండ్ కు తగ్గట్టు మార లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. స్లోగా బ్యాటింగ్ చేసే రహనే ఐపీఎల్లోనూ గతంలో కొన్ని మ్యాచ్ ల్లో మినహా చాలా అంటే చాలా నార్మల్గా ఆడేవాడు. దీంతో ఈసారి వేలంలో రహానేని ఒక్క జట్టు కూడా కొనుగోలు చేయలేదు. రహానే కనీస ధర రూ.50 లక్షల కు సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. రహానేను కొనుగోలు చేసేసరికి చాలామంది చెన్నై జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు.
కసితో రగిలిపోయిన రహానే.. హిట్టింగ్ తో విజృంభన..
టెస్ట్ బ్యాటర్ గా తనపై ముద్ర వేసిన వారికి ఇప్పుడు బ్యాట్ తో సమాధానం చెబుతున్నాడు రహానే. కనీస ధరకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించని ఎన్నో జట్ల యాజమాన్యాలకు.. తన బ్యాట్ పదును ఏంటో చూపిస్తున్నాడు ప్రస్తుతం ఆట తీరుతో. గతానికి భిన్నంగా చెన్నై జట్టులోకి వచ్చిన తర్వాత రహానే పూర్తిగా మారిపోయాడు. కొన్ని మ్యాచ్ ల్లో రహానే బ్యాటింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ నోరెళ్ళపెట్టే పరిస్థితి. ఎందుకంటే ఆ రేంజ్ లో పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు రహానే. ముంబై పై 67, ఆర్సిబి పై 37, రాజస్థాన్ పై 31 పరుగులు చేశాడు. ఈ పరుగులన్నీ అతి తక్కువ బంతుల్లోనే చేయడం గమనార్హం. ఇక తాజాగా జరిగిన కోల్కతాతో మ్యాచ్ లో అయితే 29 బంతుల్లోనే 71 పరుగులు కొట్టి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇదంతా చూస్తుంటే తనని ఏ ప్రాంచైజీలు అయితే వద్దనుకున్నాయో.. వాళ్లని గుర్తు పెట్టుకుని మరీ వాళ్ల జట్లపైనే రహానే బాదుతున్నాడా అన్నట్లుగా అభిమానులకు కనిపిస్తోంది.
జట్టులోకి పునరాగమనం చేసిన రహానే..
ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన రహానే.. ఇండియా జట్టులోకి వచ్చేసాడు. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండులోని ఓవల్ మైదానంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తలపడనుంది. ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ కు మంగళవారం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అనూహ్యంగా రహానే జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో ఆడిన ఐదు మ్యాచ్ ల్లో 52 సగటుతో 209 పరుగులు చేశాడు రహానే. 199.04 స్ట్రైక్ రేటుతో అందరి కంటే టాప్ లో ఉన్నాడు. ఈ ఐపీఎల్ ప్రదర్శనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జట్టులో స్థానాన్ని కల్పించిందని పలువురు పేర్కొంటున్నారు.