IPL 2024: ఐపీఎల్ ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.. సాయంత్రం కాగానే జనం టీవీల ముందు వాలిపోతున్నారు. యువత ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అలాంటి పొట్టి క్రికెట్ లో మన దేశానికి చెందిన కొంత మంది ఆటగాళ్లు వీరవిహారం చేస్తున్నారు. అసలే యువకులు.. ఆపై అవకాశాల కోసం అర్రులు చాచి ఉన్నారు.. ఇంకేముంది ప్రతిభను చూపిస్తున్నారు. అటు బంతితో.. ఇటు బ్యాట్ తో మైదానంలో తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరంటే..
శివం దూబె
చెన్నై జట్టు తరుపున ఆడుతున్నాడు ఈ యువకుడు. నిలకడకు మారుపేరుగా నిలుస్తున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా భారీ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు..34*, 51, 18, 45.. ఇవీ గత నాలుగు ఇన్నింగ్స్ లలో శివం చేసిన పరుగులు. గత ఏడాది ఐపిఎల్ లోనూ శివం ఇదే స్థాయిలో ఆడాడు. టోర్నీ మొత్తం అద్భుతంగా ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు లభిస్తుందని అందరూ భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆసియన్ గేమ్స్ లో భాగంగా చైనా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో తప్ప… అతను కనిపించిన టోర్నీ లేదు.
రియాన్ పరాగ్
ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీతో కలిసి పరుగులు చేస్తున్నాడు ఈ యువకుడు. మైదానంలో “అతి ” తప్పితే.. పరుగుల వేటలో మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఆడుతున్నాడు. విదేశీ బౌలర్లను సైతం దీటుగా ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో 100కు పైగా సగటుతో 261 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
మయాంక్ యాదవ్
భారత జట్టులో జస్ ప్రీత్ బుమ్రాను మినహాయిస్తే.. ఆ స్థాయిలో బౌలింగ్ చేసే పేస్ బౌలర్ లేడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తూ.. మైదానంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు మయాంక్ యాదవ్. బుమ్రా తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానంగా నిలుస్తున్నాడు.. బంతులు వేయడం మాత్రమే కాదు సరైన లైన్, లెంగ్త్ తో విసురుతూ సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ ఇలాగే వేగంగా బంతులు వేసినప్పటికీ.. మయాంక్ అలా కాకుండా ఖచ్చితమైన లైన్ అండ్ లెన్త్ ను పాటిస్తున్నాడు.. గంటకు 156, 157 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి రికార్డుల మోత మోగిస్తున్నాడు.
పై ముగ్గురు ఆ స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. వారికి టీ -20 వరల్డ్ కప్ లో జాతీయ జట్టులో చోటు దక్కేది అనుమానం గానే ఉంది. ఎందుకంటే దానికి కారణం సీనియర్లు.. ప్రతి సందర్భంలో జట్టులోకి యువ రక్తం కావాలని.. యువకులతో ఆడించాలని చెప్పే బీసీసీఐ సెలక్టర్లు.. మెగా టోర్నీల విషయానికి వచ్చేసరికి సీనియర్ల వైపే మొగ్గు చూపిస్తుంటారు. అలాంటప్పుడు విజయాలు, కప్ లు ఎలా సాధ్యమవుతాయో వారికే తెలియాలి. జాతీయ జట్టులో స్థానం లభించక.. ఐపీఎల్ లాంటి టోర్నీలలో ప్రతిభ చూపినప్పటికీ.. ఉపయోగం లేక.. చాలామంది యువకులు క్రికెట్ కు అర్ధాంతరంగా వీడ్కోలు పలికారు. మరి అలాంటి ఉదంతాలను దృష్టిలో పెట్టుకొనయినా బీసీసీఐ వచ్చే టి20 వరల్డ్ కప్ లో యువకులకు అవకాశం ఇవ్వాలని క్రీడా విశ్లేషకులు కోరుతున్నారు.