CSK Vs DC: అనుకున్నదే జరిగింది.. అనుమానించింది నిజమైంది. సొంత గడ్డపై చెన్నై(CSK)జట్టుకు మరో పరాజయం ఎదురైంది. మొత్తంగా ఈ ఐపిఎల్(IPL) సీజన్లో హ్యాట్రిక్ ఓటమిని చెన్నై జట్టు ముట్టుకట్టుకుంది. శనివారం చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఢిల్లీ (CSK vs DC) చేతిలో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Also Read: ఢిల్లీ 183.. చెన్నై గెలిచేది కష్టమే.. ఎందుకంటే..
టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు లాస్ అయి 183 పరుగులు చేసింది. ఓపెనర్ కె ఎల్ రాహుల్ (77) సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అభిషేక్ పోరెల్ 33 పరుగులతో సత్తా చాటాడు. స్టబ్స్ 22, అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వి 20 పరుగులతో దుమ్మురేపారు. ఫలితంగా ఢిల్లీ జట్టు 183 పరుగులు చేసింది. చెన్నై జట్టులో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీష పతీరణ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే చివరి ఓవర్లను చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఢిల్లీ జట్టు 200 స్కోర్ చేయలేకపోయింది. చివరి ఓవర్ లో మతీష పతీరణ కేఎల్ రాహుల్, అశుతోశ్ శర్మ ను వరుస బంతుల్లో అవుట్ చేయడం.. కేవలం 7 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఢిల్లీ జుట్టు స్కోరు 183/6 వద్ద ఆగిపోయింది..
అనుమానమే నిజమైంది
చెన్నై జట్టు సొంత స్టేడియంలో ఆడుతున్నప్పటికీ.. ఈ మ్యాచ్లో గెలిచేది అనుమానమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఎందుకంటే చెన్నై జట్టు సొంత మైదానంలో ఒక్కసారి మాత్రమే 175+ స్కోర్ ను చేజ్ చేసింది..180+ టార్గెట్ ను రెండుసార్లు మాత్రమే అధిగమించగలిగింది. 2012లో చెన్నై మైదానంలో చెన్నై బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అప్పుడు బెంగళూరు విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు చేజ్ చేసింది. 2023లో చిదంబరం స్టేడియంలో చెన్నై జట్టు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ విధించిన 201 పరుగుల టార్గెట్ ను చెన్నై చేజ్ చేసింది. ఆ తర్వాత ఇప్పటివరకు మరోసారి ఆ స్థాయిలో చెన్నై జట్టు విజయాలు సాధించలేకపోయింది. అయితేసొంత మైదానంలో ఆడుతున్నారు కాబట్టి ఏదైనా అద్భుతం జరగవచ్చునేమోనని చెన్నై అభిమానులు అంచనా వేశారు. కానీ చెన్నై జట్టు విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఢిల్లీ బౌలర్లు అదరగొట్టారు
184 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన చెన్నై జట్టు ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర 3 పరుగులకే అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కాన్వే 13 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ 5 పరుగులకే వెను తిరిగాడు. ఈ దశలో విజయ్ శంకర్ 69* అదరగొట్టాడు. అయితే అతడికి ధోని 30* మినహా మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లభించలేదు. శివం దుబే 18, రవీంద్ర జడేజా రెండు పరుగులు చేసి అవుట్ అయ్యారు.. దీంతో చెన్నై జట్టు ఇన్నింగ్స్ 158 పరుగుల వద్ద ముగిసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ రెండు వికెట్లు సాధించాడు. స్టార్క్, ముఖేష్, కులదీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.. ఢిల్లీ బౌలర్లు ప్రారంభం నుంచి చివరిదాకా పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్నారు. ఫీల్డింగ్ లో కూడా అద్భుతాలు చేశారు. ఏ దశలోనూ చెన్నై జట్టుకు గెలిచే అవకాశాలు ఇవ్వలేదు. ఢిల్లీ జట్టు తీరు చూస్తుంటే ఆడుతోంది ఢిల్లీలోనా అనే అనుమానం కలిగింది. మొత్తంగా ఢిల్లీ జట్టు ప్రారంభం నుంచి చివరిదాక తీరైన ఆట తీరు ప్రదర్శించడంతో చెన్నై జట్టుకు ఓటమి తప్పలేదు.