https://oktelugu.com/

GT vs DC : ఇదేం పిచ్‌రా స్వామి.. ప్రపంచంలోనే నంబర్‌ 1 స్టేడియం తీరుపై విమర్శలు

ఇక ఈ మ్యాచ్‌లో పవర్‌ ప్లే ముగిసేసరికి గుజరాత్‌ స్కోరు 30/4. ఈ సీజన్‌లో పవర్‌ ప్లే ముగిసే సరికి ఇదే రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం పంత్‌ మెరుపు స్టంపింగ్‌తో గుజరాత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. తర్వాత ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2024 / 10:55 PM IST

    Narendra Modi Stadium

    Follow us on

    GT vs DC : గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ప్రపంచంలోనే నంబర్‌ 1 స్టేడియంగా గుర్తింపు పొందింది. అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంలో అత్యధిక(1.32 లక్షల) మంది ఆడియన్స్‌ కూర్చునేలా నిర్మించారు. అయితే సౌకర్యాల వరకు బాగానే ఉన్నా.. పిచ్‌ తీరుపైనే విమర్శలు వస్తున్నాయి. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఈ మైదానంలోనే జరిగింది. టీమిండియా అప్పటివరకూ బాగా ఆడి ఈ పిచ్ పై పరుగులు చేయలేక ఆపసోపాలు పడి ఓడిపోయింది.  తక్కువ స్కోర్‌కే మ్యాచ్‌ ముగిసింది. అప్పుడే పిచ్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ తర్వాత రిపోర్టు ఇచ్చింది. పిచ్‌ మందకొడిగా ఉన్నట్లు వెల్లడించింది. ఔట్‌ ఫీల్డ్‌ మాత్రం బాగున్నట్లు తెలిపింది. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు 50 ఓవర్లలో కేవలం 240 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

    ఐపీఎల్‌లోనూ..
    తాజాగా ఇదే మైదానంలో ఢిల్లీ–గుజరాత్‌ జట్ల మధ్య బుధవారం(ఏప్రిల్‌ 17న) మ్యాచ్‌ జరిగింది. ఐపీఎల్‌ అంటేనే పరుగుల వరద. కానీ, మోదీ స్టేడియంలో పరుగులు రావడమే గగనంగా మారుతోంది. ఐపీఎల్‌లో కూడా ఆటగాళ్లు పరుగులు చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. ఆతిథ్య జట్టు గుజరాత్‌ను కేవలం 89 పరుగలకే కుప్ప కూల్చారు. దీంతో ఈ సీజన్‌లో అత్యల్ప స్కోర్‌ నమోదైంది.

    బౌలింగ్‌ ఎంచుకుని..
    ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ పంత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం సరైందే అని మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే అర్థమైంది. ఢిల్లీ బౌలర్లు పదునైన బంతులతో గుజరాత్‌ బ్యాటర్లను గడగడలాడించారు. ఎవరినీ క్రీజ్‌లో కుదురుకోనివ్వలేదు. బౌలింగ్‌కు తోడు ఫీలింగ్‌లోనూ ఢిల్లీ ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబర్చారు. ఇక వికెట్ల వెనుక పంత్‌ చురుగ్గా కదులుతూ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ దెబ్బకు జీటీ కేవలం 17.3 ఓవర్లకే 89 పరుగులు చేసి ఆల్‌ఔట్‌ అయింది.

    పరుగుల రాకే గగనమైంది..
    టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను… శుభ్‌మన్‌ గిల్, వృద్ధిమాన్‌ సాహా ప్రారంభించారు. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదిన గిల్‌.. తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ ఇషాంత్‌ శర్మ వేసిన రెండో ఓవర్‌లో ఐదో బంతికి పృథ్వీ షాకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 8 పరుగులకే గిల్‌ పెవిలియన్‌ చేరాడు. కాసేపటికే గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రెండు పరుగులు చేసి వృద్ధిమాన్‌ సాహా ఔటయ్యాడు. ముకేశ్‌ కుమార్‌ వేసిన నాలుగో ఓవర్‌లో ఐదో బంతిని వికెట్ల మీదికి ఆడుకుని సాహా వెనుదిరిగాడు. 4 ఓవర్లకు 28 పరుగులు చేసి గుజరాత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత వరుగా వికెట్లు పడుతూ వచ్చాయి. 12 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 28 పరుగుల వద్దే గుజరాత్‌ మరో వికెట్‌ను కోల్పోయింది. పంత్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌కు డేవిడ్‌ మిల్లర్‌ అవుటయ్యాడు.

    పవర్‌ ప్లేలో 30 పరుగులే..
    ఇక ఈ మ్యాచ్‌లో పవర్‌ ప్లే ముగిసేసరికి గుజరాత్‌ స్కోరు 30/4. ఈ సీజన్‌లో పవర్‌ ప్లే ముగిసే సరికి ఇదే రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం పంత్‌ మెరుపు స్టంపింగ్‌తో గుజరాత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. తర్వాత ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు.

    మైదానం తీరుపై విమర్శలు..
    టీ20 మ్యాచ్‌లలో పిచ్‌తో సంబంధం లేకుండా బ్యాట్‌మెన్స్‌ పరుగుల వరద పారిస్తారు. కానీ, అహ్మదాబాద్‌ మైదానంలో వన్డే మ్యాచ్‌ జరిగినా, టీ20 మ్యాచ్‌ జరిగినా, ఐపీఎల్‌ జరిగినా పరుగులు రావడం గగనమవుతోంది. గత ప్రపంచకప్ ఫైనల్ లో ఈ పిచ్ కారణంగానే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు గుజరాత్ కూడా బలహీన ఢిల్లీ చేతిలో ఇలానే ఓటమి చవిచూసింది.  బ్యాట్స్‌మెన్లు ఎంత ప్రయత్నించినా పరుగులు రావడం లేదు. ఈ క్రమంలో వికెట్లు సమర్పించుకుంటున్నారు. పిచ్‌లు రూపొందించిన తీరుపైనే అభిమానులు మండిపడుతున్నారు.