Crime News : మా తల్లే.. బిడ్డ ప్రాణాలతో చెలగాటం.. నువ్వుసలు తల్లివేనా? వీడియో

ఓ నెటిజన్ ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఆ రైడ్ కు సంబంధించి ఉపయోగించిన స్కూటీ ఓ వ్యక్తిదని(బహుశా అతడు తండ్రై ఉంటాడు) తెలుస్తోంది.. అతడికి ఓ ట్రాఫిక్ పోలీస్ చాలాన్ అందించాడు.. అంటే ఆ వీడియో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి రావడం... ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందువల్ల చలాన్ విధించినట్టు తెలుస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 17, 2024 10:47 pm

crime

Follow us on

Crime News : నవ మాసాలు మోస్తుంది. కడుపులో తంతున్నా ఓర్పుగా భరిస్తుంది. పున్నమి వేళ చందమామను చూపించుకుంటూ గోరుముద్దలు తినిపిస్తుంది. కథలెన్నో చెబుతూ.. మారం చేసినా గారాబం చేస్తుంది. అందుకే భూమ్మీద దేవుడు తనకు బదులుగా అమ్మను సృష్టించాడని చెబుతుంటారు. ఈ పుడమి మీద తల్లి ప్రేమకు వెలకట్టలేం. ఆమె ప్రేమను ఇతరులతో పోల్చలేం. అలాంటిది ఓ తల్లి తన కొడుకు ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది. అంతేకాదు థ్రిల్ రైడ్ చేస్తూ గొప్పలు పోయింది. దీనికి సంబంధించిన వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. ఈ సంఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరులో జరిగింది.

దేశ ఐటి రాజధానిగా పేరుపొందిన బెంగళూరులో వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివసిస్తుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ (ఆ సమయంలో ఆమె పక్కన భర్త లేడు) ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిందో తెలియదు గానీ.. సుమారు 8 నుంచి 9 ఏళ్ల వయసు ఉండే తమ కుమారుడిని స్కూటీపై తీసుకెళ్తూ థ్రిల్ రైడ్ చేసింది. ఆ తల్లి వ్యవహరించిన తీరు పట్ల చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ మహిళను ఏకిపారేస్తున్నారు.. ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి అంటూ విమర్శిస్తున్నారు.

ఆ వీడియోలో ఆ తల్లి తన కుమారుడిని స్కూటీ ఫుట్ రెస్ట్ పై నిల్చోబెట్టింది. అలానే వేగంగా బండిని నడుపుతోంది. ఆ స్కూటీ వెనుక వైపు ప్రయాణిస్తున్న కొంతమంది వీడియో తీసి దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది దెబ్బకు అది వైరల్ అయిపోయింది. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత కొంతమంది ఫేమస్ అవ్వడానికి, మరి కొంతమంది తమ పిల్లలను ఆనందింప చేయడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. కార్లు, బైకులపై ఎక్కించి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు ట్రాఫిక్ పోలీసులకు ఎక్కువైపోయాయి.

ఇక కుమారుడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ మహిళపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం తడబడినా ఆ బాలుడు కింద పడిపోతాడు. పక్క నుంచి ఏదైనా వాహనం ఢీకొడితే.. చెప్పడానికి ఏమి ఉండదు. పైగా బిజీగా ఉన్న రోడ్డులో అలాంటి రైడ్ చేయడం అవసరమా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఈ వీడియో వైరల్ కాగానే.. ఓ నెటిజన్ ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఆ రైడ్ కు సంబంధించి ఉపయోగించిన స్కూటీ ఓ వ్యక్తిదని(బహుశా అతడు తండ్రై ఉంటాడు) తెలుస్తోంది.. అతడికి ఓ ట్రాఫిక్ పోలీస్ చాలాన్ అందించాడు.. అంటే ఆ వీడియో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి రావడం… ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందువల్ల చలాన్ విధించినట్టు తెలుస్తోంది.