Cricket tournament prize not given : గల్లీలో క్రికెట్ ఆడితే.. గెలిచిన వారికి వెంటనే బహుమతి ఇస్తారు. టోర్నమెంటులో కూడా ఇదే పద్ధతి పాటిస్తారు. ఇక అంతర్జాతీయ టోర్నీలలో అయితే వెంటనే నగదు బహుమతి చెక్కు రూపంలో అందిస్తారు. క్రికెట్ అనేది భావోద్వేగంతో కూడుకున్న క్రీడ. అందులో విజేతలకు వెంటనే ప్రకటించిన నగదు బహుమతి ఇవ్వాల్సిందే. అలా ఇవ్వలేని సామర్థ్యం ఉన్నప్పుడు టోర్నీలు నిర్వహించకపోవడమే మంచిది.
సమకాలిన క్రికెట్ చరిత్రలో జట్టు గెలిచినప్పటికీ.. నగదు బహుమతి ఇవ్వకుండా ముఖం తిప్పేసుకున్న ఘటనలు ఇంతవరకు చోటు చేసుకోలేదు. కానీ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఇటువంటి దారుణం చోటుచేసుకుంది. టోర్నమెంట్ జరిగి ఏడాది పూర్తయినప్పటికీ.. వరకు ప్రైజ్ మనీ లభించలేదు. దీంతో ప్లేయర్లు కళ్లు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ పెద్దలను అడుగుతున్నప్పటికీ.. ఉపయోగం లేకుండా పోతోంది.. ఇంతకీ ఈ దారుణమైన సంఘటన ఎక్కడ జరిగింది అంటే..
ఇస్లాం దేశాలలో ఒమన్ ప్రత్యేకమైనది.. ఎడారి ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇక్కడ విస్తృతంగా చమురు నిల్వలు ఉంటాయి. ఖర్జూర చెట్లు కూడా విస్తారంగా పెరుగుతుంటాయి. పర్యాటకులు కూడా భారీగానే వస్తుంటారు. అటు చమురు, ఖర్జూర పండ్ల ఎగమతి, పర్యాటకం ద్వారా ఒమన్ దేశానికి భారీగానే ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి ఐసీసీ గతంలోనే అడుగులు వేసింది. ఇక్కడ ప్రత్యేకంగా బోర్డు కూడా ఉంది. ఈ బోర్డు ఆధ్వర్యంలో అప్పుడప్పుడు టోర్నీలు జరుగుతుంటాయి. 2024లో
టి20 టోర్నీ జరిగింది. ఆ టోర్నిలో ఒమన్ పాల్గొన్నది. అయితే ఆ ట్రోఫీ లో పాల్గొన్న ఆటగాళ్లకు ఐసీసీ అందించిన నగదును ఒమన్ క్రికెట్ బోర్డు ఇంతవరకు ఇవ్వలేదు. ప్రైజ్ మనీ ఇవ్వకుండా ఏడాది పాటు కాలయాపన చేస్తోంది.
బోర్డు తీరుపై ఆగ్రహం
బోర్డు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆటగాళ్లు కశ్యప్ ప్రజాపతి, ఫయాజ్ బట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఐసీసీ, వరల్డ్ క్రికెట్ అసోసియేషన్ నిబంధనలు సవరించినప్పటికీ ఒమన్ క్రికెట్ బోర్డు తన ధోరణి మార్చుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.. ఈ పరిణామం వల్ల ఒమన్ క్రికెట్లో గందరగోళం నెలకొన్నది. గత ఏడాది టి20 ప్రపంచ కప్ లో ఆడిన నేపథ్యంలో ఆటగాళ్లకు వచ్చిన బహుమతి డబ్బును పంపిణీ చేయకుండా ఒమన్ క్రికెట్ బోర్డు నిర్లక్ష్యం వహిస్తోంది. ఇక ఈ టోర్నీ లో ఐసీసీ దాదాపు రెండు కోట్ల రూపాయలకు సమానమైన నగదు బహుమతిని అందించింది. ఐసీసీ నిబంధన ప్రకారం ఆ డబ్బులు ఆటగాళ్లకు 21 రోజుల్లో సమానంగా పంపిణీ చేయాలి.
టోర్నీ పూర్తయి ఏడాది కావస్తున్నప్పటికీ…
టోర్నీ పూర్తయి ఏడాది కావస్తున్నప్పటికీ ఇంతవరకు ప్లేయర్లకు డబ్బు అందలేదు. కేవలం ఒమన్ క్రికెట్ బోర్డు మాత్రమే కాకుండా.. చాలా వరకు క్రికెట్ బోర్డులు ప్లేయర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నాయి.. అయితే టి20 వరల్డ్ కప్ కు సంబంధించి నగదు ఆటగాళ్లకు అందించని బోర్డుగా ఒమన్ నిలిచింది. బోర్డు వ్యవహరిస్తున్న తీరుతో ప్లేయర్లు విసిగిపోతున్నారు..
ప్లేయర్లు ఏమంటున్నారంటే..
ఒమన్ జట్టు తరుపున ఆడుతున్న కశ్యప్ భారత్ లో జన్మించాడు. అయినప్పటికీ ఒమన్ తరఫున అతడు ఆడుతున్నాడు. అతడు 37 వన్డేలు, 47 t20 లు ఆడాడు. అయితే అతడు ప్రస్తుతం శ్వేత దేశంలో చిక్కుకున్నాడు. తన భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నాడు.” మా జీవితాలు ఆగమైపోయాయి. జట్టులో స్థానాలు కోల్పోయాం. ఒప్పందాలు కూడా రద్దు అయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రైజ్ మనీ ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. బోర్డు పెద్దలు వ్యవరిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదని” ప్రజాపతి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరో ఆటగాడు ఫయాజ్ కూడా ప్రజాపతి మాదిరిగానే ఇబ్బంది పడుతున్నాడు.” నా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. 30 వన్డేలు, 47 t20 లు ఆడాను. గత్యంతరం లేక ఇప్పుడు నేను ఒమన్ వదిలి పెట్టక తప్పలేదు. నాకు ఉద్యోగం కూడా లేదు. ఎవరైనా అవకాశాలు ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నాను. ఒక రకంగా నా క్రీడా జీవితం ముగిసిపోయినట్టేనని” అతడు ఆవేదనతో వ్యాఖ్యానించాడు.