Cheteshwar Pujara: తన పూర్వపు లయను అందుకోవడానికి ఇటీవల దేశవాళి క్రికెట్లో సత్తా చాటాడు. పరుగుల వరద పారించాడు. దీంతో అతడిని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అతడు తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. దీంతో అతడికి నిరాశ ఎదురయింది.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పూజారకు మెరుగైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియా మైదానాలపై అతడు స్థిరమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా కు చిరస్మణీయ విజయాలు అందించాడు. అయితే మొదట్లో ఉన్న అద్భుతమైన ఫామ్ ను అతడు చివరి వరకు కొనసాగించలేకపోయాడు. దీంతో అతడు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఈలోగా వర్ధమాన క్రికెటర్లు టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పూజార స్థానం గల్లంతయింది. వైట్ బాల్ క్రికెట్ కు అలవాటు పడిన భారత ఆటగాళ్లు.. పింక్ బాల్ ఫార్మేట్ లోనూ అదే సత్తా చూపించారు. న్యూజిలాండ్ సిరీస్ మినహా.. మిగతా అన్నింటిలో భారత్ అప్రతిహత విజయయాత్రను కొనసాగించింది. దీంతో పూజారకు రిక్తహస్తమే మిగిలింది. అయితే ఇటీవలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎంపికలో అతడి పేరు వినిపించినప్పటికీ… జట్టులో స్థానం లభించలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత్ కోల్పోయింది. ఆ సమయంలో పూజరాను మళ్ళీ జట్టులోకి తీసుకోవాలని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా బీసీసీఐని కోరారు. అయినప్పటికీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా సెలెక్టర్లు పూజార పేరును పరిగణలోకి తీసుకోలేదు.
కొత్త అవతారంలో
సెలెక్టర్లు తనను ఎంపిక చేయకపోయినప్పటికీ పూజార బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా బయలుదేరి వెళుతున్నాడు. అయితే అతడు ఈసారి వ్యాఖ్యాత అవతారం ఎత్తనున్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో హిందీ వ్యాఖ్యాతగా అతడు వ్యవహరించనున్నాడు. పూజార భారత్ తరపున 103 టెస్టులు ఆడాడు. 7,195 రన్స్ చేశాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 24 టెస్టులు ఆడి 2,043 రన్స్ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇదే సిరీస్ లో రాహుల్ ద్రావిడ్ 32 టెస్టులు ఆడి 2,143, వివిఎస్ లక్ష్మణ్ 29 టెస్టులు ఆడి 2,434 రన్స్ చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 34 టెస్టులు ఆడి 3,262 రన్స్ చేశాడు. అయితే పూజార దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నప్పటికీ.. జట్టులో పోటీ కారణంగా అతడికి అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. దేశవాళీ మాదిరిగానే ఫామ్ కొనసాగిస్తే భవిష్యత్తులో అతడికి స్థానం లభించే అవకాశాలు కొట్టి పారేయలేమని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.