https://oktelugu.com/

Pushpa 2 Trailer: పుష్ప-2 ట్రైలర్.. బన్నీని తమ వాడిగా చూపిస్తున్న వైసిపి

శత్రువుకు శత్రువు మిత్రుడు. బహుశా ఈ అంచనాతోనే అల్లు అర్జున్ ను దగ్గరగా చేర్చుకుంటోంది వైసిపి. పవన్ కళ్యాణ్ ను విభేదిస్తుండడంతో బన్నీని ప్రచారాస్త్రంగా మార్చుకుంటోంది.

Written By: Dharma, Updated On : November 18, 2024 2:00 pm
Pushpa 2 Trailer(3)

Pushpa 2 Trailer(3)

Follow us on

Pushpa 2 Trailer: అల్లు అర్జున్ ను తమ వాడిగా చూసుకుంటున్నారు వైసీపీ శ్రేణులు.దానికి కారణం లేకపోలేదు.మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన అల్లు అర్జున్.. క్రమేపి ఆ కుటుంబానికి దూరమైనట్లు కనిపించారు. సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు.అయితే సినీ పరిశ్రమలో ఇది సర్వసాధారణమే అయినా.. మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో చర్చకు దారితీస్తోంది. మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన హీరోలు అరడజను మందికిపైగా ఉన్నారు. వీరంతా చిరంజీవి వేసిన ప్లాట్ ఫామ్ పై వచ్చారు. అదే విషయాన్ని చెప్పుకొచ్చారు.దీనికి అల్లుఅర్జున్ కూడా అతితుడు కాదు. చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు అర్జున్. చిరంజీవి లేకపోతే తమకు సినీ జీవితం లేదన్నట్టు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ వైఖరిలో మార్పు కనిపించింది. మెగా కుటుంబమంతా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచింది. ఆయన కట్టిన కూటమికి వెన్నుదన్నుగా నిలిచింది. కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కు శుభాకాంక్షలు చెబుతూనే.. వైసీపీకి నేరుగా ప్రచారం చేసినట్టు అనిపించారు. ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ నంద్యాలలోని తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లారు. మెగా అభిమానులు చిచ్చు రావడానికి కూడా ఇదే కారణం. పవన్ ఉండగా వైసీపీ నేతకు మద్దతు తెలుపుతావా అంటూ మెగా అభిమానులు ప్రశ్నించడం ప్రారంభించారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయింది. అల్లు అర్జున్ చర్యలను మెగా అభిమానులు వ్యతిరేకిస్తుండగా.. వైసీపీ శ్రేణులు అక్కున చేర్చుకుంటుండడం విశేషం.

* పాట్నాలో ట్రైలర్ విడుదల
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్ విడుదల అయింది.పాన్ ఇండియా సినిమా కావడంతో బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ను విడుదల చేశారు. కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలి వెళ్లారు. అయితే జన సందోహాన్ని, పవన్ సభకు వచ్చే జనంతో పోల్చుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం గమనార్హం. పవన్ ఏపీలో మాత్రమే జనాలు వస్తారని..కానీ అల్లు అర్జున్ కు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఫాన్స్ ఉన్నారని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు అభిమానులు. అయితే సోషల్ మీడియాలో ఇలా వస్తున్న పోస్టులు అధికంగా వైసిపి వారు పెడుతున్నవేనని తెలుస్తోంది.

* వివాదానికి అదే కారణం
వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడంతో అల్లు అర్జున్ మెగా అభిమానులకు దూరమయ్యారు. అప్పట్లో మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది.దీంతో మెగా, బన్నీ అభిమానుల మధ్య వార్ నడిచింది.అయితే సోషల్ మీడియాలో ఆ పోస్టును డిలీట్ చేశారు నాగబాబు.మరోవైపు ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ మంచిగా మాట్లాడారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు.కానీ పుష్ప 2 ట్రైలర్ ను రాజకీయంగా వాడుకుంటుంది వైసిపి. మరి అటు బన్నీ అభిమానులు,ఇటు మెగా అభిమానులు సంయమనం పాటిస్తారా? లేకుంటే గతం మాదిరిగా రచ్చ చేస్తారా?అన్నది తెలియాలి