CEAT Cricket Awards: CEAT సంస్థ ప్రతి ఏటా ఉత్తమ క్రికెటర్లకు పురస్కారాలు అందిస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా పురస్కారాలు ప్రకటించింది. టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కించుకున్నాడు.. ఆగస్టు 21, బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, ఇతర భారత స్టార్ క్రికెటర్లు ఈ పురస్కారాలను దక్కించుకున్నారు.
పురుషుల అంతర్జాతీయ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో రోహిత్ అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. 2023లో రోహిత్ అన్ని ఫార్మాట్లలో కలిపి 1,800 పరుగులు చేశాడు. వన్డేలలో 52.59 సగటుతో 1,255 రన్స్ చేశాడు. ముఖ్యంగా స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ లో 597 రన్స్ చేశాడు. ఈ టోర్నీలో సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు.
వన్డే బెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. 23లో కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 8 అర్థ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా విరాట్ కోహ్లీ 1,377 రన్స్ చేశాడు.. వన్డే ప్రపంచ కప్ లో 11 మ్యాచ్ లలో 95.62 సగటుతో 765 రన్స్ చేశాడు. టోర్నీలో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు.
భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కారం లభించింది. ఇటీవల బార్బడోస్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో భారత జట్టును అతడు విజయ పథంలో నడిపించాడు. తద్వారా రోహిత్ సేన పొట్టి కప్ అందుకుంది. ద్రావిడ్ చూపించిన తెగువ వల్ల టీమిండియా విజయాన్ని దక్కించుకుంది.. ఈ నేపథ్యంలో ద్రావిడ్ శిక్షణను ప్రశంసిస్తూ అతడికి జీవన సాఫల్య పురస్కారాన్ని CEAT సంస్థ అందించింది.
2023 వన్డే ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి బెస్ట్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం లభించింది. షమీ అసాధారణ బౌలింగ్, చూపించిన నైపుణ్యం అతడిని స్టార్ బౌలర్ ను చేశాయి. భారత్ సాధించిన విజయాలలో కీలకంగా మారాయి. వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అతడు అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడు.
పురస్కారాలు సాధించిన ఇతర ఆటగాళ్ల జాబితా ఇదీ
టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ – యశస్వి జైస్వాల్
టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ – రవిచంద్రన్ అశ్విన్
టి20 బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ – ఫిల్ సాల్ట్
టి20 బౌలర్ ఆఫ్ ది ఇయర్ – టిమ్ సౌథి
స్టార్ స్పోర్ట్స్ టి20 అవార్డు: శ్రేయస్ అయ్యర్ (కోల్ కతా నైట్ రైడర్స్)
స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు: జై షా, బీసీసీఐ జనరల్ సెక్రెటరీ
ఉమెన్స్ విభాగంలో..
ఉమెన్స్ టి20 చరిత్రలో కెప్టెన్ గా అత్యధిక మ్యాచ్ లు ఆడినందుకుగానూ హర్మన్ ప్రీత్ కౌర్ కు పురస్కారం లభించింది. ఇండియన్ ఉమెన్ క్రికెట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ గా దీప్తి శర్మ.. మహిళా టెస్ట్ విభాగంలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ – షఫాలివర్మ పురస్కారాలను దక్కించుకున్నారు.