https://oktelugu.com/

Cricket: T20 World Cup తో క్రికెట్ లో అమెరికా పాగా వేయగలదా?

Cricket: 2024 t20 వరల్డ్ కప్ కోసం అమెరికా(America), వెస్టిండీస్(West Indies) ఆతిథ్యం ఇస్తున్నాయని ఐసిసి 2021లో ప్రకటించినప్పుడు చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 27, 2024 / 06:43 PM IST

    america t20 world cup

    Follow us on

    Cricket: క్రికెట్ అంటే మనదేశంలో చెవి కోసుకుంటారు. టీమిండియా ఆడే మ్యాచ్ లు చూసేందుకు ఖండాంతరాలు కూడా దాటి వెళ్తారు. అంతటి స్తోమత లేని వారైతే టీవీల ముందు అతుక్కుపోతారు.. త్వరలో టి20 వరల్డ్ కప్(T20 World Cup) జరిగే అమెరికాలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయా? క్రికెట్ గురించి ప్రస్తావనకు వస్తే ఎవరికి కూడా అమెరికా పేరు గుర్తుకురాదు. అలాంటి చోట టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు.. అసలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? టి20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ లో అమెరికా పాగా వెయ్యగలుగుతుందా? క్రికెట్ ను శాసిస్తున్న భారత్ కు శ్వేత దేశం చెక్ పెట్టగలుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

    చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు

    2024 t20 వరల్డ్ కప్ కోసం అమెరికా(America), వెస్టిండీస్(West Indies) ఆతిథ్యం ఇస్తున్నాయని ఐసిసి 2021లో ప్రకటించినప్పుడు చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. అమెరికాలో క్రికెట్ ఆడేందుకు అవసరమైన సదుపాయాలు లేవు. కనీసం అక్కడి జట్టుకు బలమైన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా లేదు. ఎప్పుడైనా అక్కడ క్రికెట్ ఆడితే.. ఇతర దేశాలతో పోలిస్తే ఆ దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది..కానీ, అమెరికాలో క్రికెట్ నిర్వహించే పాలక సంస్థ యుఎస్ఏ క్రికెట్ టి20 వరల్డ్ కప్ నిర్వహణ కోసం దరఖాస్తు చేయడం.. దానిని ఐసీసీ ఆమోదించడం.. అమెరికాలో యుద్ధ ప్రాతిపదికన క్రికెట్ మైదానాలు నిర్మించడం.. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడు టి20లో సిరీస్ ను.. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే అమెరికా జట్టు గెలుచుకోవడం.. వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.” క్రికెట్ ను విస్తరించడం.. కొత్త మార్కెట్లను సృష్టించడం.. ఒలంపిక్స్ వంటి వాటిల్లో క్రికెట్ ను చేర్చడం.. వంటి కారణాలతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో క్రికెట్ ను అన్ని దేశాలు ఆడతాయని.. దీనిని కొట్టి పారేయలేమని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. లాస్ ఏంజిల్స్ లో 2028 లో జరిగే ఒలంపిక్స్ లో టి20 క్రికెట్ ను చేర్చేందుకు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ముంబైలో గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిందని.. వారు గుర్తు చేస్తున్నారు.

    250 కోట్ల మంది చూస్తున్నారు

    ప్రపంచంలో 250 కోట్ల మంది క్రికెట్ చూస్తున్నారు.. వర్ధమాన క్రికెట్లో అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించిన టీమ్ ఇండియా క్రీడాకారుడు విరాట్ కోహ్లీని సోషల్ మీడియాలో 34 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువమంది అనుసరించే మూడవ క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. లి బ్రాన్ జేమ్స్, టామ్ బ్రాడీ, టైగర్ వుడ్స్ కంటే కూడా.. విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే అమెరికా.. భవిష్యత్తు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని.. టి20 క్రికెట్ కప్ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకొని ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

    44 లక్షలు దాటేసింది

    ఇక అమెరికాలో 2020-21లో భారత సంతతికి చెందిన వారి సంఖ్య 44 లక్షలు దాటేసింది. అమెరికాలో దక్షిణాసియా సంతతికి చెందిన ప్రజల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. దీంతో క్రికెట్ పై ఆ దేశంలో ఆసక్తి ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో ఐసీసీ అమెరికాలో క్రికెట్ మ్యాచ్ ల సంఖ్యను పెంచింది. అంతకుముందు అసోసియేట్ మెంబర్ షిప్ కూడా ఇచ్చింది. ఇందులో భాగంగానే టి20 వరల్డ్ కప్ ను అమెరికాలో నిర్వహించేందుకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు క్రికెట్ కు కొత్త మార్కెట్ గా అమెరికాను సృష్టించేందుకు ఐసీసీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ ద్వారా అమెరికాలో క్రికెట్ పాపులారిటీ పెరిగితే.. వెస్టిండీస్ ఆటగాళ్లకు, అక్కడ క్రికెట్ కు ప్రయోజనం చేకూరుతుందని కరేబియన్ క్రికెటర్లు భావిస్తున్నారు. అమెరికాకు టి20 వరల్డ్ కప్ ఆతిథ్యం రావడం వెనక యూఎస్ఏ క్రికెట్ కు చెందిన స్వతంత్ర డైరెక్టర్ పరాగ్ మరాటే, ఐసీసీ మాజీ సీఈవో ఈయాన్ సిగ్గిన్స్ కీలకపాత్ర పోషించారు.

    బ్రిటిష్ కాలనీ ఉన్నప్పుడే..

    బ్రిటిష్ కాలనీ ఉన్నప్పుడే అమెరికాలో క్రికెట్ మొదలైంది. ప్రస్తుతం చాలా దేశాలు ఆడుతున్నట్టే అప్పట్లో అమెరికాలో క్రికెట్ కూడా ఆడారు. ఎందుకంటే అమెరికా బ్రిటిష్ ఆధీనంలో లేకపోవడంతో.. ఈ క్రీడ విస్తరించలేదు. పైగా ఈ క్రీడను సంపన్న వర్గాల చెందిన ఆటగా మాత్రమే చూసేవారు. అమెరికాలో సివిల్ వార్ జరుగుతున్నప్పుడు బేస్ బాల్ వంటి క్రీడ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. క్రికెట్ ను అప్పట్లో ఐదు రోజులు ఆడేవారు.. దీంతో అమెరికాలో అ క్రీడ ఎక్కువగా ప్రాచుర్యానికి నోచుకోలేకపోయింది. రెండు దశాబ్దాలలో క్రికెట్ సమూల మార్పులకు గురికావడం, టి20 క్రికెట్ ఆగమనం వంటివి ఈ క్రీడకు విశేషమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అమెరికాలో టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లకు టెక్సాస్ లోని గ్రాండ్ ఫెయిరీ స్టేడియం, ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రో వార్డ్ పార్క్, న్యూయార్క్ వేదికలు కానున్నాయి.. ఇంత స్థాయిలో క్రికెట్ ను అభివృద్ధి చేసినప్పటికీ.. అమెరికాలో ప్రాచుర్యం పొందేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

    Shah Rukh Khan: గౌతమ్ గంభీర్ చూపు అటువైపు.. బ్లాంక్ చెక్ ఇచ్చిన షారుక్..

    IPL Season 17: ఈ ఐపీఎల్ సీజన్ లో వీరు ఫట్… వారు హిట్..