Ben Stokes: బెన్‌ స్టోక్స్‌ 2.O.. ప్రపచంలోనే రెండో క్రికెటర్‌.. వన్డేల్లోంచి రిటైర్ అయ్యి.. తిరిగొచ్చి మరీ కొడుతున్నాడు

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జాసన్‌ రాయ్‌ 2018 ఆస్ట్రేలియాపై 180 పరుగులు చేసిన రికార్డును స్టోక్స్‌ బద్దలు కొట్టాడు. వన్డేల్లో నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌ నిలిచారు.

Written By: Raj Shekar, Updated On : September 14, 2023 2:38 pm

Ben Stokes

Follow us on

Ben Stokes: రిటైర్మెంట్‌ ప్రకటించి.. వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కొత్త చరిత్రను లిఖించాడు. న్యూజిలాండ్‌ జరుగుతున్న మూడో వన్డేల సిరీస్‌లో సెంచరీతో అదరగొట్టాడు. అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.వన్డే ఫార్మాట్లో రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టోక్స్‌ రీ ఎంట్రీ మ్యాచులో విధ్వంసకర శతకంతో చెలరేగుతున్నాడు. కివీస్‌ నాలుగు మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వన్డేలో స్టోక్స్‌ 52 పరుగులు చేయగా, రెండో వన్డే కేవలం ఒక్క పరుగుకు ఔట్‌ అయ్యాడు. ఇక మూడో వన్డేలో బౌండరీల వర్షం కురిపించి 124 బంతుల్లోనే 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 రన్స్‌ చేశాడు. దీంతో వన్డేల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.

బెన్‌ స్టోక్స్‌ రికార్డులివే..
ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జాసన్‌ రాయ్‌ 2018 ఆస్ట్రేలియాపై 180 పరుగులు చేసిన రికార్డును స్టోక్స్‌ బద్దలు కొట్టాడు. వన్డేల్లో నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌ నిలిచారు. విండీస్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ 189 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డే ఫార్మాట్లో ఇంగ్లాండ్‌ తరుఫున 3 వేల పరుగులు పూర్తి చేసిన 19వ ఆటగాడిగా స్టోక్స్‌ నిలిచారు. ఇందులో నాలుగు సెంచరీలు, 22 హాఫ్‌ సెంచరీలను బాదాడు. వన్డేల్లో ఇంగ్లాండ్‌ తరుఫున 3వేల పరుగులు, 50 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా స్టోక్స్‌ నిలిచాడు. ఇక స్వదేశంలో 2వేల పరుగుల మార్కును స్టోక్స్‌ అందుకోవడం విశేషం.

భారత్‌కు షాక్‌ తప్పదా..!
వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ అభిమానులకు శుభవార్త అందింది. ఆ జట్టు టెస్టు కెప్టెన్, స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వన్డేలు ఆడేందుకు సిద్ధం అయ్యాడు. వన్డేల్లో తాను తీసుకున్న రిటైర్‌మెంట్‌ నిర్ణయంపై వెనక్కి తగ్గాడు. ప్రపంచ కప్‌ నేపథ్యంలో బెన్‌ స్టోక్స్‌ జట్టులో ఉంటే బాగుంటుందని భావించిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు, వన్డే కెప్టెన్‌న్‌ జోస్‌ బట్లర్‌ ఈ మేరకు స్టోక్స్‌ను ఒప్పించడంలో సఫలం అయ్యారు.

2019 వరల్డ్‌ కప్‌లో కీలక పాత్ర..
2019 వన్డే ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌ జట్టు గెలుచుకోవడంలో బెన్‌ స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు స్టోక్స్‌ ఒంటరి పోరాటం చేశాడు. చివరికి క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన తన జట్టుకు వన్డే ప్రపంచకప్‌ ను అందించాడు. ఇంగ్లాండ్‌కు ఇదే మొదటి వన్డే ప్రపంచకప్‌ కావడం గమనార్హం.

ఫిట్‌నెస్‌ సమస్యతో రిటైర్మెంట్‌..
ఆ తరువాత గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా గతేడాది స్టోక్స్‌ వన్డేలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఆ తరువాత సుధీర్ఘ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఎంపికై బజ్‌బాల్‌ విధానంతో తన జట్టుకు అద్వితీయమైన విజయాలను అందిస్తున్నాడు. అయితే.. భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ అయిన స్టోక్స్‌ ఆడితే తమ జట్టు మరోసారి కప్పును గెలుస్తుందని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు భావించింది. ఈ విషయమై పలు మార్లు స్టోక్స్‌తో చర్చించింది. వన్డే కెప్టెన్‌ అయిన జోస్‌ బట్లర్‌ సైతం నిత్యం స్టోక్స్‌తో టచ్‌లో ఉంటూ అతడు తిరిగి వన్డేల్లో ఆడేందుకు ఒప్పించాడు. అతడు ఒప్పుకోవడంతో న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్‌ జట్టు ఆడనున్న వన్డే, టీ20 సిరీస్‌కు స్టోక్స్‌ను ఎంపిక చేశారు.

అంచనాలకు మించి ప్రదర్శన..
ఇక న్యూజిలాండ్‌పై స్టోక్స్‌ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇంగ్లడ్‌ బోర్డు, కెప్టెన్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వచ్చే వన్డే వరల్డ్‌ కప్‌లో నిలపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్టోక్స్‌ జట్టులోకి రావడంతో ఇంగ్లాండ్‌ బలం రెట్టింపు అయింది.