CM Chandrababu: స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు.. చీఫ్ విప్ గా ధూళిపాళ్ల.. చంద్రబాబు స్కెచ్

నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయ్యన్నపాత్రుడు. 1983లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు టిడిపిలో చేరారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి రామచంద్ర రాజు పై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

Written By: Dharma, Updated On : June 15, 2024 2:11 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: తెలుగుదేశం పార్టీలో చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫైర్ బ్రాండ్. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేత కూడా.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి పదవి దక్కించుకుంటూ వస్తున్నారు.కానీ ఈసారి మాత్రం చంద్రబాబు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. అయినా అసంతృప్తికి గురి కాలేదు. జూనియర్లుగా ఉన్న తమకు ఎన్టీఆర్ పదవులు ఇచ్చారని.. అప్పట్లో సీనియర్లు పరిస్థితి ఏంటని ప్రశ్నించడం ద్వారా అధినేతపై ఉన్న విధేయతను చాటుకున్నారు. అయితే ఈసారి అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. శాసనసభ స్పీకర్ గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. సీనియారిటీతో పాటు సభా సాంప్రదాయాలు తెలిసిన నేత కావడంతో చంద్రబాబు మొగ్గు చూపినట్లు సమాచారం.

నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయ్యన్నపాత్రుడు. 1983లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు టిడిపిలో చేరారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి రామచంద్ర రాజు పై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1984లో అయ్యన్నను ఎన్టీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో సైతం పోటీ చేసి గెలిచారు అయ్యన్న. 1989 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో మరోసారి గెలిచిన ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆర్ అండ్ బి మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. 1996లో లోక్సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. కానీ 1999 ఎన్నికల్లో తిరిగి నర్సీపట్నం నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 2004లో మరోసారి గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009లో మాత్రం ఓడిపోయారు. 2014లో మరోసారి నర్సీపట్నం నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి విజయం సాధించారు.

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అయ్యన్నపాత్రుడు మంత్రి అయ్యారు. కానీ ఈసారి ఆ ఆనవాయితీ తప్పింది. ఇప్పుడు ఆయన పేరు స్పీకర్ గా వినిపిస్తోంది. సీనియర్ నేతగా చంద్రబాబు ఎంపిక చేసినట్లు సమాచారం. మరోవైపు మంత్రి పదవి ఆశించారు ధూళిపాళ్ల నరేంద్ర. కానీ ఆయనకు పదవి దక్కలేదు. ఆయనకు చీఫ్ విప్ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. గతంలోనూ అదే పదవిని నరేంద్ర చేపట్టారు. ఇప్పుడు మంత్రి పదవి దక్కకపోయేసరికి చంద్రబాబు ఆయనకు ఆఫర్ చేసినట్లు సమాచారం.