Temba Bavuma Sledged: క్రికెట్ ఆడే అన్ని దేశాలు గెలవడానికి ప్రయత్నిస్తాయి. కాకపోతే ఇందులో సాధ్యమైనంత వరకు ధర్మ మార్గాలను అనుసరిస్తాయి. అంతేతప్ప చెత్తదారులను వెతుక్కోవు. కానీ కంగారు జట్టు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆ జట్టు ఓటమిని ఒప్పుకోదు. ఓడిపోవడాన్ని సహించదు. ప్రత్యర్థి జట్టు గెలిచే దశలో ఉన్నప్పుడు మానసికంగా యుద్ధానికి దిగుతుంది. ఎలాంటి ప్రయత్నం చేసైన సరే గెలవాలని చూస్తుంది. అందువల్లే ఆ జట్టు చివరి దశలో సైతం విజయాన్ని అందుకుంటుంది. పడతాం తనకు వ్యతిరేకంగా వస్తున్నా సరే.. అనుకూలంగా మార్చుకుంటుంది. ప్రత్యర్థి ఆటగాళ్లను తిట్టడం.. వెకిలి సైగలు చేస్తూ ఇబ్బంది పెట్టడం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.. ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు మాత్రమే కాదు.. పూర్వకాలం నుంచే ఇలాంటి దిక్కుమాలిన విధానాలకు శ్రీకారం చుట్టింది. జెంటిల్మెన్ గేమ్ లో.. ప్రొఫెషనలిజం చూపించాల్సిన తరుణంలో.. నేలబారుతనాన్ని ప్రదర్శించి.. పరువు తీసుకున్నది. తీసుకుంటూనే ఉన్నది.
Also Read: భారత్ – ఇంగ్లాండ్ సిరీస్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా.. కారణమిదే..
కంగారు జట్టుపై అనేక సందర్భాలలో ఆరోపణలు వచ్చినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మందలించినప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లలో మార్పు రావడం లేదు. మారాలని కూడా వారు కోరుకోవడం లేదు. తాజాగా సుదీర్ఘ ఫార్మాట్ ప్రపంచ సమరంలో భాగంగా జరిగిన తుది పోరులో ప్రోటీస్ జట్టు కంగారు బృందంపై ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో రెండవసారి టెస్ట్ గద అందుకోవాలనే కోరిక కోరికగానే మిగిలిపోయింది కంగారు జట్టుకు. అయితే తుది పోరు జరుగుతున్న నేపథ్యంలో.. మ్యాచ్ నాలుగవ రోజు తమను అనేక రకాలుగా కంగారు బృందం ఇబ్బంది పెట్టిందని ప్రోటిస్ బృంద నాయకుడు బవుమా వాపోయాడు. ప్రఖ్యాత ఆంగ్ల మీడియాతో అతడు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు..” నాలుగో రోజు మేము విజయానికి అత్యంత దగ్గరగా ఉన్నాం. ఆ సమయంలో మరో 69 పరుగులు చేస్తే మేము గెలుపును సొంతం చేసుకుంటాం. మా చేతిలో అప్పటికి ఎనిమిది వికెట్లు ఉన్నాయి. అయినప్పటికీ సరే మేము ఆల్ అవుట్ అవుతామని.. మ్యాచ్ చేజార్చుకుంటామని కంగారు జట్టులో ఉన్న ఒక ఆటగాడు వ్యాఖ్యానించాడు. మమ్మల్ని చోకర్స్ అని విమర్శించాడు.. వింత వింత సంకేతాలతో మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. గట్టిగా అరుస్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అతడు అన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ మేము మా సమయమనం కోల్పోలేదు. పైగా నేను, మార్క్రం జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాం. వారు అలా ఇబ్బంది పెట్టడం వల్లే మాలో మరింత కసి పెరిగింది. గెలవాలి అనే కోరిక పెరిగింది. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ.. అంతిమంగా మేము విజయం సాధించామని” బవుమా పేర్కొన్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా పై ఆగ్రహానికి కారణమయ్యాడు.