India England Series Trophy Unveiling: ఇంగ్లీష్ – భారత జట్లు తలపడే సుదీర్ఘ ఫార్మాట్ ట్రోఫీకి అండర్సన్ – టెండూల్కర్ నామకరణం చేశారు. వాస్తవానికి ఈరోజు అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రెండు బోర్డులు కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా పడింది. ఒకానొక దశలో ఈ ట్రోఫీ ఆవిష్కరణను పూర్తిగా రద్దు చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం వల్ల భారత దేశంలో ఒక రకమైన విషాద వాతావరణం నెలకొంది. అందువల్ల ఈ ట్రోఫీ నామకరణ, ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
శనివారం డబ్ల్యూటీసీ తుది పోరు సందర్భంగా ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా.. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ మండలి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని భావించాయి. ఈ కార్యక్రమాన్ని లార్డ్స్ లో చేపట్టాలని ముందుగా నిర్ణయించుకున్నాయి.. అయితే అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి..” ఇండియాలో జరిగిన విషాద సంఘటన నేపథ్యంలో.. చనిపోయిన వారి స్మృత్యర్థం ఈ ట్రోఫీ నామకరణ, ఆవిష్కరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. సరైన సమయంలో కొత్త తేదీని ప్రకటిస్తాం. ఈ ప్రకటనకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని” ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారులు ప్రకటించారు.
పటౌడి వారసత్వం కొనసాగుతుంది
ఇంగ్లీష్ దేశంలో జరిగే దయపాక్షిక సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ విజేతలకు గతంలో పటౌడి పేరుతో ట్రోఫీ అందించేవారు.. అయితే దాని స్థానంలో అండర్సన్ – టెండూల్కర్ పేరును జోడించారు. ఇదే విషయాన్ని ఆంగ్ల జట్టు క్రికెట్ బోర్డు పటౌడి కుటుంబ సభ్యులకు వెల్లడించింది.. అయితే సచిన్ స్వయంగా చేసిన అభ్యర్థన మేరకు ఆంగ్ల జట్టు క్రికెట్ బోర్డు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. పటౌడి వారసత్వాన్ని కొనసాగించాలని సచిన్ టెండుల్కర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఆంగ్ల క్రికెట్ బోర్డు అధికారులతో మాట్లాడినట్టు తెలుస్తోంది.. దీంతో బీసీసీఐ మాజీ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జై షా రంగంలోకి దిగి పటౌడి పేరు తగ్గకుండా చూసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇక ఇదే విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ధ్రువీకరించారు..” ద్వైపాక్షిక సిరీస్లో పటౌడి పేరు కూడా కొనసాగించాలని ఒక అభ్యర్థన వచ్చింది. అతని పేరుతో ఒక మెడల్ తెరపైకి తీసుకొచ్చి అవకాశం ఉంది. బహుశా ఆ మెడల్ విజేత జట్టు సారధికి ఇచ్చే అవకాశం ఉందని” ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ప్రకటించారు.