Australia Vs India(1)
India Vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ మొదలైంది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మెక్ స్వానే కు విశ్రాంతి ఇచ్చిన ఆస్ట్రేలియా మేనేజ్మెంట్.. 19 సంవత్సరాల యువ ఆటగాడు సామ్ కొన్ స్టాస్ కు అవకాశం కల్పించింది. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 65 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. బుమ్రా నుంచి మొదలు పెడితే రవీంద్ర జడేజా వరకు ఎవరి బౌలింగ్ ను కొన్ స్టాస్ వదిలిపెట్టలేదు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్కూప్, రివర్స్ స్కూప్ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతని బ్యాటింగ్ చూసి టీమిండియా బౌలర్లు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. కొన్ స్టాస్ ను ఎట్టకేలకు రవీంద్ర జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 60 పరుగులు చేసిన అతడిని పెవిలియన్ పంపించాడు. దీంతో టీమిండియా కాస్త ఊపిరి పీల్చుకుంది.
మంటలు పెట్టాడు
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికి విరాట్ కోహ్లీ మెల్ బోర్న్ మైదానంలో మంటలు పెట్టాడు. చల్లగా ఉన్న వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాడు. అప్పటికే ఓవర్ ముగియగా.. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ఆస్ట్రేలియా యువ ఆటగాడు కొన్ స్టాస్ బ్యాటింగ్ చేయడానికి వస్తుండగా.. బంతిని అందుకున్న విరాట్ కోహ్లీ బౌలర్ కు అందించడానికి వస్తున్నాడు. ఇదే క్రమంలో కొన్ స్టాస్ భుజాన్ని తగులుకుంటూ వెళ్ళాడు. ఇది కొన్ స్టాస్ కు కోపం తెప్పించింది. “అలా భుజం రాసుకుంటూ వెళ్తున్నావు ఏంటి” అని కోహ్లీని ఉద్దేశించి కొన్ స్టాస్ వ్యాఖ్యానించగా.. కోహ్లీ కూడా అదే స్థాయిలో బదులిచ్చాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. గొడవ పెద్దది అవుతుందని భావించి.. ఆస్ట్రేలియా మరో ఓపెనర్ లబు షేన్ గొడవను సద్దుమణిగించాడు. టీమిండియా ఆటగాళ్లు కూడా సర్ది చెప్పడంతో కోహ్లీ వెనక్కి తగ్గాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కోహ్లీకి దూకుడు స్వభావం ఉంటుంది. అతడు ఏ జట్టుపై ఆడుతున్నా తన దూకుడు ధోరణి తగ్గించుకోడు. అంతకంతకు వేగంగా దూసుకు వెళ్తుంటాడు. అందువల్లే అతడిని టీమిండియా ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. కొన్ స్టాస్ పై దూకుడుగా వెళ్లడం ఆశ్చర్యం కలిగించలేదని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. ” అతడు దూకుడుగా ఉంటాడు. అతడి మాటలు, చేష్టలు అలాగే ఉంటాయి.. అతడి గురించి తెలిసిన వారు ఎవరైనా సరే.. అతడి జోలికి వెళ్లడానికి సాహసించరు. కొన్ స్టాస్ ను కోహ్లీ ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు అనేది అర్థం కావడం లేదని” మాజీ క్రికెటర్లు అంటున్నారు. బుమ్రా పై కొన్ స్టాస్ చేసిన వ్యాఖ్యల వల్లే కోహ్లీ అలా స్పందించి ఉంటాడని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.
బాక్సింగ్ డే టెస్టులో టీమ్ ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కొన్ స్టాస్ ను స్లెడ్జింగ్ చేశాడు. అతడి భుజాన్ని తాకుకుంటూ వచ్చాడు.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. #BoxingDayTest #AUSvIND pic.twitter.com/n3K94AsvQX
— Anabothula Bhaskar (@AnabothulaB) December 26, 2024