https://oktelugu.com/

Chandrababu Delhi Tour: చంద్రబాబు ఢిల్లీ టూర్.. ప్రధానితో సహా కేంద్ర మంత్రులతో భేటీ.. వాటిపైనే చర్చ!

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు గంట పాటు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా వారి మధ్య ఏపీ అభివృద్ధి పై చర్చ జరిగినట్లు సమాచారం.

Written By:
  • Dharma
  • , Updated On : December 26, 2024 / 09:03 AM IST

    Chandrababu Delhi Tour

    Follow us on

    Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. మాజీ ప్రధాని వాజ్పేయ్ శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరయ్యారు. అనంతరం వరుసగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సీఎం పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కీలక ప్రతిపాదనలతో చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెట్టారు. గత బడ్జెట్లో కేటాయింపులపై సైతం చర్చలు జరిపారు.వీలైనంత త్వరగా ఆ కేటాయింపులను జారీ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.ప్రత్యేక పరిస్థితుల్లో కూటమిని ఏపీ ప్రజలు గెలిపించారని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే కేంద్రం ఇతోధికంగా సాయం చేయాలని కోరారు. దీనికి ప్రధానమంత్రి మోడీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. విభజన జరిగిన పదేళ్లలో.. కేంద్రం నుంచి ఇటువంటి సానుకూలత ఎప్పుడూ చూడలేదని.. కూటమి వర్గాలు చెబుతున్నాయి.

    * గంట పాటు సాగిన సమావేశం
    ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు గంట పాటు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా వారి మధ్య ఏపీ అభివృద్ధి పై చర్చ జరిగినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తో పాటు అమరావతి రాజధానికి సహకారం అందించాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టులో పురోగతిని చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. రాజకీయ అంశాలు సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. తెలుగుదేశం, బిజెపి, జనసేన పొత్తు సుదీర్ఘంగా కొనసాగాలని ఆ ఇద్దరు నేతలు ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి తనకు విడిచి పెట్టాలని.. రాజకీయంగా ఎన్డీఏ కు సహకారం అందించాలని చంద్రబాబును ప్రధాని కోరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తో సమావేశం ఫలప్రదం అయినట్లు చెప్పుకొచ్చారు.

    * కేంద్ర మంత్రులతో భేటీ
    ప్రధాని మోదీ తో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ముందుగా కేంద్రమంత్రి అమిత్ షా తో 45 నిమిషాల పాటు సమావేశం కావడం విశేషం. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపుల పై చర్చించారు. అంతకుముందు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తో సైతం భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూడడంతో పాటు పలు అంశాలపై చర్చించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. మొత్తానికి అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి.