Asia Cup winning team prediction: ఐపీఎల్ తర్వాత.. టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ ఆడింది. వాస్తవానికి సుదీర్ఘ ఫార్మాట్ కూడా టీమిండియా అభిమానులకు అద్భుతమైన క్రికెట్ ఆనందాన్ని అందించింది. స్వల్ప విరామం తర్వాత టీమిండియా మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ తో టీమిండియా మళ్లీ లైన్ లోకి వెళ్తోంది. కొంతకాలంగా పొట్టి ఫార్మాట్ వినోదానికి దూరమైన అభిమానులకు.. ఆసియా కప్ అద్భుతమైన క్రికెట్ ఆనందాన్ని అందిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఆసియా కప్ లో టీమిండియా తన సుదీర్ఘ ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడబోతోంది. పైగా ఈ టోర్నీ మొత్తం పొట్టి ఫార్మాట్లో జరుగుతుంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నీ మొదలవుతుంది. వాస్తవానికి ఆసియా కప్ ఒకప్పుడు వన్డే విధానంలో సాగింది. 2016 నుంచి టి20 విధానానికి మారిపోయింది. 2022లో వన్డే విధానంలో సాగింది. ఎందుకంటే ఆ సంవత్సరం పొట్టి ప్రపంచకప్ ఉంది కాబట్టి నిర్వాహకులు ఆ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది మళ్లీ పొట్టి ప్రపంచ కప్ జరుగుతుంది కాబట్టి నిర్వాహకులు మళ్లీ ఈసారి ఆసియా కప్ ను టి20 విధానంలో సాగిస్తున్నారు.
ఆసియా కప్ లో ప్రస్తుతం 8 జట్లు రంగంలోకి దిగుతున్నాయి. 9న ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. పదవ తేదీన యూఏఈ తో భారత్ తన మొదటి పోరు మొదలు పెడుతుంది. పాకిస్తాన్ భారత్ మధ్య 14న మ్యాచ్ జరుగుతుంది.. ఇక ఇప్పటివరకు ఆసియా కప్ టోర్నీలు 16 సార్లు జరిగాయి. ఇందులో అత్యధిక సార్లు (8) భారత్ విజయం సాధించింది. ఆసియా కప్ టి20 విధానంలో జరగడం ఇది మూడోసారి. 2016లో తొలి ఆసియా కప్ టి20 విధానంలో జరిగింది. ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. 2022లో భారత్ ఫైనల్ చేరుకోలేకపోయింది. పాకిస్తాన్, శ్రీలంక తుది పోరులో తలపడ్డాయి. చివరికి శ్రీలంక విజేతగా నిలిచింది. 2023లో వన్డే ఫార్మాట్లో ఆసియా కప్ జరిగితే.. భారత్ విజయం సొంతం చేసుకుంది.
ఒమన్ తొలిసారిగా..
ఆసియా కప్ లో ఒమన్ తొలిసారిగా రంగంలోకి దిగుతోంది. హాంకాంగ్ 2018, 2022, యూఏఈ 2016లో ఈ టోర్నీలో పోటీలోకి దిగాయి. ఈసారి భారత విజేతగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పొట్టి ప్రపంచ కప్ గెలిచిన దగ్గరనుంచి టీమిండియా ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. పైగా భారత ఆటగాళ్లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్ల నుంచి మొదలు పెడితే టెయిల్ ఎండర్ల వరకు బ్యాటింగ్ చేయగలరు. బౌలింగ్ లోను అద్భుతాలు సృష్టించగలరు. తమదైన రోజే కాదు.. తమది కాని రోజు కూడా భారత ప్లేయర్లు మెరుపులు మెరిపించగలరు. అందువల్లే ఈసారి కూడా భారత్ విజేతగా నిలుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.