Ravichandran Ashwin : కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానంలో రెండవ టెస్ట్ లో రెండు రోజులపాటు ఆట వర్షం వల్ల కొనసాగలేదు. అయినప్పటికీ టీమిండియా మిగతా రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది. అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం 173.2 ఓవర్ల పాటు సాగిన రెండవ టెస్టులో భారత్ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో బంగ్లా జట్టును పడుకోబెట్టింది. ఓవర్ల పరంగా చూసుకుంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగవ అతి చిన్న మ్యాచ్. వర్షం వల్ల కాన్పూర్ మైదానంలో తొలిరోజు కేవలం 35 ఓవర్ల పాటు మాత్రమే ఆటసాగింది. వర్షం వల్ల రెండు, మూడు రోజుల్లో ఆట సాగలేదు. కానీ చివరి రెండు రోజుల్లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చూపించింది. బౌలర్లు, బ్యాటర్లు, ఫీల్డర్లు అద్భుతంగా ఆడటంతో భారత్ విజయం సాధించింది. భారత విజయంలో స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ముఖ్యపాత్ర పోషించాడు. అందువల్లే అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం లభించింది. బంగ్లా తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో అశ్విన్ 114 పరుగులు చేశాడు. 11 వికెట్లు పడగొట్టాడు.
బంగ్లా పై సాధించిన విజయం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలు గెలుచుకున్న ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్ తో సమానంగా నిలిచాడు. ముత్తయ్య మురళీధరన్ 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలు సందర్శిస్తున్నాడు. వాస్తవానికి మురళీధరన్ రికార్డును అశ్విన్ ఎప్పుడో అధిగమించేవాడు. కానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు దానికి సహకరించలేదు. గత ఏడాది భారత్ వెస్టిండీస్ లో పర్యటించింది. ఆ సమయంలో రెండు టెస్టుల సిరీస్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. ఒకవేళ దానిని ప్రకటించి గనుక ఉంటే కచ్చితంగా అశ్విన్ కు దక్కేది. ఎందుకంటే ఆ సిరీస్లో అశ్విన్ ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ తర్వాతి స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు. అతడు ఏడు వికెట్లు పడగొట్టాడు. 15 వికెట్లు మాత్రమే కాకుండా రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ చేశాడు. రెండవ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత మహమ్మద్ సిరాజ్ కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారమిచ్చి సైలెంట్ గా ఉండిపోయింది. ఆ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని ప్రకటించడం మర్చిపోయిందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎటువంటి ప్రకటన చేయలేదు. క్రికెట్ చరిత్రలో రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ లు జరిగే సిరీస్ కు కచ్చితంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలు ఇస్తారు. కానీ వెస్టిండీస్ క్రికెట్ జట్టు అలా చేయలేదు.