Sarfaraz Khan : ఇరానీ కప్ లో భాగంగా ముంబై జట్టు రెస్ట్ ఆఫ్ ఇండియా తో తలపడుతోంది. ముంబై జట్టు తరఫున ఆడుతున్న సర్ఫరాజ్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. సర్పరాజ్ బ్యాటింగ్ దూకుడుతో ముంబై జట్టు 500 పరుగుల మార్క్ అవలీలగా దాటింది. ఈ డబుల్ సెంచరీ ద్వారా సర్ఫరాజ్ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇరానీ కప్ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి ముంబై ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.. ఇది మాత్రమే కాకుండా 4 వేలకు పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో.. అత్యధిక సగటును సాధించిన రెండవ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. సర్పరాజ్ 69.8 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అతనికంటే ముందు విజయ్ మర్చంట్ అనే ఆటగాడు 81.8 సగటుతో అగ్రస్థానంలో ఉన్నాడు. సర్పరాజ్ తర్వాతి స్థానాల్లో అజయ్ శర్మ 68.7, శాంతను 63.1, విజయ్ హజారే 61.2 ఉన్నారు.
ఓవర్ నైట్ స్కోర్ 237/4 తో బుధవారం రెండవ రోజు ముంబై జట్టు ఆట మొదలుపెట్టింది. ప్రారంభంలోనే కెప్టెన్ రహానే వికెట్ 97 పరుగుల వద్ద కోల్పోయింది. యశ్ బౌలింగ్ లో రహానే కీపర్ ధృవ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో రహానే – సర్పరాజ్ 131 పరుగుల భాగస్వామ్యానికి శుభం కార్డు పడింది. అనంతరం షామ్స్ ములాని(5) వెంటనే అవుట్ కావడంతో ముంబై జట్టు స్వల్ప పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లను నష్టపోయింది. ఈ క్రమంలో సర్పరాజ్ తనుష్ కొటియన్(64) తో కలిసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు.. తనుష్ తో కలిసి 183 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇదే సమయంలో 149 బాల్స్ లో సెంచరీ చేశాడు. మరో 104 బంతుల్లో దానిని డబుల్ సెంచరీగా రూపాంతరం చెందించాడు.
సర్ఫరాజ్ ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ టెస్ట్ కు ఎంపికయ్యాడు. అయితే రెండు టెస్టుల్లోనూ అతడు తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ కు అవకాశం ఇవ్వడంతో అతడు రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. మెడ భాగం వద్ద గాయాలయ్యాయి. సోదరుడికి గాయమైనప్పటికీ సర్ఫరాజ్ ఏకాగ్రతను కోల్పోలేదు. తనను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసిన వారికి .. ఆట తీరుతోనే సర్ఫరాజ్ సమాధానం చెప్పాడు.