Aiden Markram WTC Final 2025: లార్డ్స్ గడ్డమీద కంగారు జట్టుపై ప్రోటీస్ జట్టు సాధించిన విజయం అంత సులువైనది కాదు. పైగా డబ్ల్యూటీసీ తుది పోరులో గెలిచి ట్రోఫీని అందుకోవడం అంత ఆషామాషీ కాదు. పోరాడాల్సిన చోట పోరాడింది సఫారి జట్టు. నిలబడాల్సిన చోట నిలబడి.. కలబడాల్సిన చోట కలబడి.. ఒక అద్భుతాన్ని సృష్టించింది.
ఈ అద్భుతానికి ముగ్గురు మూల కారణం.. రబాడ, బవుమా.. ద్వితీయ, తృతీయ పాత్రలు పోషిస్తే.. వారిలో ప్రధముడు మార్క్రం. సఫారీ జట్టు రెండవ ఇన్నింగ్స్ లో ఇతడు చేసిన 136 పరుగులు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇతడు చేసిన పరుగులు సఫారీ జట్టుకు సంజీవని లాగా నిలిచాయి.. కంగారు బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా.. గతంలో చేసిన పొరపాట్లకు ఏమాత్రం తావు ఇవ్వకుండా అతడు చేసిన బ్యాటింగ్ అద్భుతం.. అనన్య సామాన్యం.. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. తగ్గాల్సిన చోట తగ్గి.. నెగ్గాల్సిన చోట నెగి తన సత్తా ఏమిటో చూపించాడు. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో సఫారీ జట్టు తరఫున రెండవ ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్ల జాబితాలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో బ్రుస్ మిచెల్ హైయెస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు..
1947లో ఇంగ్లాండ్ జట్టుతో ఓవర్లో తలపడిన మ్యాచ్లో మిచెల్ 189 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
2008లో ఇంగ్లాండ్ గడ్డమీద ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గ్రేమ్ స్మిత్ 154 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.
2018లో డర్బన్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో మార్క్రం 143 పరుగులు చేశాడు.
2017లో ఇంగ్లీష్ గడ్డమీద ఆంగ్ల జట్టుపై దీ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో డీన్ ఎల్గర్ 136 పరుగులు చేశాడు.
ఈ ఏడాది లార్డ్స్ వేదికగా డబ్ల్యూటీసీ తుది పోరులో కంగారు జట్టుపై మార్క్రం 136 పరుగులు చేశాడు.
ఇక 2014లో సఫారీ జట్టుకు అండర్ 19 విభాగంలో మార్క్రం విశ్వ కప్ అందించాడు..
గత ఏడాది పొట్టి ఫార్మాట్లో జరిగిన ప్రపంచ సమరంలో సఫారీ జట్టును రన్నరప్ గా నిలిపాడు మార్క్రం.
2024 లో విశ్వ సమరంలో భాగంగా జరిగిన పొట్టి ఫార్మాట్ తుది పోరులో మార్క్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సఫారి జట్టు ఓటమిపాలైంది. ఓటమి తర్వాత అతడు కన్నీరు పెట్టుకున్నాడు. భార్యను ఆలింగనం చేసుకొని ఏడ్చాడు. ఏడాది గడవక ముందే తన జట్టుకు సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వకప్ అందించి.. తన భార్యను హత్తుకుని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆ సంతోషాన్ని తట్టుకోలేక మార్క్రం భార్య మైదానంలో అందరి ముందు అతని పెదాలను తీపి చేసింది.