Ahmedabad Pitch Report : బెంగళూరు, పంజాబ్ అభిమానుల రాకతో అహ్మదాబాద్ నగరం కిటకిటలాడుతోంది. విమానాశ్రయంలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు రావడంతో హోటల్ రూమ్స్ కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు అర్ధరాత్రి వరకు రవాణా సౌకర్యం కల్పించడంతో అభిమానులు మస్తుగా మ్యాచ్ చూసేందుకు అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ వల్ల ఫైనల్ మ్యాచ్ కాస్త ఆలస్యమైనా.. అంతిమంగా మాత్రం ప్రేక్షకుల కోరుకునే క్రికెట్ ఆనందం లభిస్తోంది.
ఇక పంజాబ్, బెంగళూరు ట్రోఫీ గెలవాలని భావిస్తున్న నేపథ్యంలో.. అహ్మదాబాద్ పిచ్ అత్యంత కీలకం కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్ చేసేందుకు అనుకూలంగా ఉంది. క్వాలిఫైయర్ -2 మ్యాచ్ కూడా ఇదే వేదికపై జరిగింది. రెండు జట్లు కూడా 200 కంటే ఎక్కువ పరుగులు సాధించాయి. అయితే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టుకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. పంజాబ్ జట్టు దానిని తిరగరాసింది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ఫీల్డింగ్ వైపు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. బంతి మీద పట్టు కలిగి ఉండే బౌలర్లు సత్తా చూపించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఆ బౌలర్లు వికెట్లు పడగొడితే ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు.
ఇక ఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం నగరంలో ఆకాశంలో మేఘాలు కల్పిస్తున్నాయి. అహ్మదాబాద్, సమీప ప్రాంతాలలో తేలిక నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఐపీఎల్ నిర్వాహక కమిటీ చెబుతోంది. ఎందుకంటే ఫైనల్ నిర్వహించడానికి రిజర్వ్ డే ఉంది. ఈ లెక్కన ఫైనల్ మ్యాచ్ బుధవారం నిర్వహించడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ అప్పుడు కూడా వర్షం ఇబ్బంది పడితే.. నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో ముద్రిస్థానంలో ఉన్న పంజాబ్ జట్టును విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి.. ఎలాగూ గంట అదనపు సమయం ఉంది కాబట్టి.. కాస్త ఆలస్యంగానైనా మ్యాచ్ నిర్వహిస్తారని తెలుస్తోంది.. ఇక అహ్మదాబాద్ మైదానంలో అత్యంత అధునాతనమైన డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఇందులో నుంచి వర్షపు నీటిని వెంట వెంటనే బయటికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. పైగా పిచ్ ను ఆరబెట్టడానికి అత్యంత ఆధునికమైన డ్రైయర్లు ఉన్నాయి. వాటి ద్వారా పిచ్ ను వెంటనే సిద్ధం చేస్తారు. ఇటీవల హార్దిక్ – అయ్యర్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ -2 మ్యాచ్ కు వర్షం కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ.. ఆ తర్వాత పిచ్ ను వెంటనే సిద్ధం చేశారు.