Homeక్రీడలుక్రికెట్‌AFG vs NZ : వర్షం కురువలేదు.. మంచు పడలేదు..ఐనా మ్యాచ్ నిర్వహించలేదు.. బీసీసీఐపై తీవ్ర...

AFG vs NZ : వర్షం కురువలేదు.. మంచు పడలేదు..ఐనా మ్యాచ్ నిర్వహించలేదు.. బీసీసీఐపై తీవ్ర విమర్శలు

AFG vs NZ : ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతోంది. ఐసీసీ పై ఏకపక్షంగా పెత్తనం సాగిస్తోంది. రేపో మాపో బిసిసిఐ సెక్రటరీ జై షా ఐసీసీ చైర్మన్ కాబోతున్నారు. ఈ ప్రకారం చేసుకుంటే బీసీసీఐకి ఇప్పట్లో ఎదురులేదు. బీసీసీఐ తలచుకుంటే ఏదైనా చేయగలదు. కానీ అలాంటి క్రికెట్ బోర్డు విమర్శల పాలవుతోంది. క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించే సమయంలో పకడ్బందీ వ్యూహం లేకపోవడంతో నవ్వుల పాలవుతోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగిన ఈ కాలంలో బీసీసీఐని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. కొంచెమైనా బుద్ధి ఉండాలని మండిపడుతున్నారు. సాయం చేసే గుణం ఇది కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇంతకీ బీసీసీఐ ఇలాంటి విమర్శలు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోంది అంటే.

సాయం చేయబోయి విమర్శలు

క్రికెట్ లో సంచలన జట్టుగా పేరుపొందిన ఆఫ్ఘనిస్తాన్ కు సొంత మైదానం లేదు.. దీంతో ఆ జట్టుకు బిసిసిఐ సాయం చేస్తామని ముందుకు వచ్చింది. నోయిడాలోని ఒక స్టేడియాన్ని ఇచ్చింది. ఈ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ జట్టుతో ఏకైక టెస్ట్ ఆడనుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఈ మ్యాచ్ మొదలు కావాల్సి ఉంది. కానీ నిన్న టాస్ కూడా వేయలేదు. దీనికి కారణం వర్షం కాదు.. మంచు అంతకన్నా కాదు. వాస్తవానికి సోమవారం అక్కడ మిల్లీమీటర్ స్థాయిలో వర్షం కూడా నమోదు కాలేదు. కానీ అక్కడ అవుట్ ఫీల్డ్ పూర్తిగా తడిగా ఉంది. దీంతో తొలిరోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. వాస్తవానికి అంతకు ముందు రోజు అక్కడ వర్షం కురిసింది. ఆ నీటిని మైదాన సిబ్బంది బయటకి తొలగించే ప్రయత్నం చేయలేకపోయారు. దారుణమైన మురుగునీటి పారుదల వ్యవస్థ వల్ల బీసీసీఐ పరువు పోయింది. అంతేకాదు ఒకరోజు ఆటకు అడ్డంకి గా మారింది.

ఎదురుచూసినప్పటికీ..

వాస్తవానికి ఒక బంతి అయినా వేయించాలని అంపైర్లు సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాల వరకు ఎదురు చూశారు. కానీ అది సాధ్యపడలేదు. రెండవ రోజు ఇప్పటివరకు ఆట మొదలు కాలేదు. టాస్ వేసేందుకు మైదానం సిద్ధం కాలేదు. మధ్యాహ్నం తర్వాత మైదానాన్ని పరీక్షించి నిర్ణయం తీసుకుంటామని అంపైర్లు ప్రకటించారు. దీంతో ఆఫ్గనిస్తాన్ జట్టుకు చెందిన అభిమానులు భారత క్రికెట్ నియంత్రణ మండలి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నోయిడా లోని ఈ మైదానంపై బీసీసీఐ 2017 లో నిషేధం విధించింది. అప్పటినుంచి బీసీసీఐ అనుబంధ టోర్నమెంట్లు అక్కడ ఒకటి కూడా జరగలేదు. స్టేడియం బాధ్యత ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకోలేదు. దీనిని గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తోంది.. ఆ స్టేడియంలో కనీసం మౌలిక సదుపాయాలు లేవు. సిబ్బంది కూడా లేరు. ఇక డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. కరోనా సమయంలో ఆ స్టేడియాన్ని ఐసోలేషన్ సెంటర్ గా ఉపయోగించారు. అప్పట్లో ఏవో ఫ్యాన్లు, ఇతర పరికరాలు బిగించారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు తాత్కాలిక సొంత మైదానంగా దానిని బీసీసీఐ కేటాయించింది. కేటాయించ కంటే ముందు అందులో ఉన్న సౌకర్యాలను ఒకసారి పరిశీలిస్తే బాగుండేది. అలా చేయకుండా అప్పగించడంతో బీసీసీఐ పెద్దలపై ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి స్టేడియాన్ని ఇచ్చి తమ దేశ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version