Operation Bhediya: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో తోడేళ్లు భీభత్సం సృష్టించాయి. తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 30 మందికి పైగా గాయపడ్డారు. రెండు తోడేలు పిల్లలు చనిపోయిన నాటి నుంచిఅంటే గత ఆరు నెలలుగా తోడేళ్లు మనుషుల మీద పగబట్టాయి. బహ్రైచ్ గ్రామస్తుల మీద వరుస దాడులు చేస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. ఆరు నెలలుగా తోడేళ్లు తమ ప్రతీకార దాడులతో 10 మందిని చంపేశాయి. ఇంకా చాలా మందిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం తోడేళ్లను పట్టుకునేందుకు ఆపరేషన్ భేడియా చేపట్టింది. తోడేళ్ల అన్వేషణ కోసం పోలీసులు, అటవీ శాఖ బృందాలు ఆ ప్రాంతంలో నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే 4 తోడేళ్లను పట్టుకున్నారు. తాజాగా మరో తోడేలును పట్టుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తం ఐదు తోడేళ్లను బందించినట్లు తెలుస్తోంది. అటవీ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఇంకా ఒక్క తోడేలు మాత్రమే మిగిలి ఉంది. దానిని కూడా త్వరగా పట్టుకుంటామని పేర్కొంటున్నారు.
40 గ్రామాల్లో బీభత్సం..
బహ్రైచ్ జిల్లాలోని మహసీ తహసీల్ ఉంది. ఈ తహసీల్‌లోని 40 గ్రామాల్లో తోడేళ్లు బీభత్సం సృష్టించాయి. ఈ ఏడాది మార్చిలో తొలిసారిగా 7 ఏళ్ల చిన్నారిపై తోడేలు దాడి చేసింది. ఆ తర్వాత నుంచి తోడేళ్ల దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో అటవీ శాఖ బృందాన్ని అప్రమత్తం చేయగా.. 6 తోడేళ్ల గుంపు మనుషులను లక్ష్యంగా చేసుకుని సంచరిస్తున్నట్లు గుర్తించారు.9 మంది పిల్లలతో సహా 10 మందిని చంపేశాయి. తోడేలు దాడి నేపథ్యంలో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చిన్నారులను రక్షించేందుకు గ్రామస్తులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బహ్రైచ్‌లోని మహసీ తహసీల్ ప్రజలు ఇప్పటికీ రాత్రిపూట మేల్కొని వీధుల్లో గస్తీ కాస్తున్నారు. తమ ఇళ్లలో పిల్లలను కాపాడుకునేందుకు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు.
రంగంలోకి 200 మంది..
తోడేళ్లను పట్టుకునేందుకు 200 మంది పీఏసీ సిబ్బందిని రంగంలోకి దించారు. అటవీ శాఖకు చెందిన 25 బృందాలు రంగంలోకి దిగాయి. ఇంకా ఒక తోడేలు మిగిలి ఉందని, దానిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. తమ బృందం ఐదో తోడేళలను పట్టుకున్నట్లు డీఎఫ్‌వో అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్లు నరమాంస భక్షకులుగా మారాయని పేర్కొన్నారు. వీటిని పట్టుకునేందుకు తమ బృందం తీవ్రంగా శ్రమించిందన్నారు.