
Paralympics 2020: ఒలింపిక్స్ లో పలు పథకాలతో గతాన్ని మరిపించిన భారత క్రీడాకారులు.. ఇప్పుడు పారా లింపిక్స్ (Paralympics) లోనూ సత్తా చాటుతున్నారు. సోమవారం ఒక్క రోజే నాలుగు పతకాలు సాధించి దుమ్ము లేపారు. ఇందులో ఒక బంగారు పతకంతోపాటు రెండు రజతాలు, ఒక కాంస్య పతకాలు ఉన్నాయి. మరి, ఈ విజేతలు ఎవరు? ఏయే పోటీల్లో పతకాలు కొల్లగొట్టారు అన్నది చూద్దాం.
షూటింగ్ విభాగంలో క్రీడాకారిణి అవనీ లేఖరా చరిత్ర సృష్టించింది. మహిళల ఆర్-2 విభాగంలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 పోటీల్లో ఏకంగా స్వర్ణ పతకం సాధించింది సత్తా చాటింది. 249.6 పాయింట్లు సాధించి, తన గురికి తిరుగులేదని చాటి చెప్పింది అవని. ఈ ఫీట్ ద్వారా.. ప్రపంచ రికార్డును సమం చేసిందీ భారత క్రీడాకారిణి. పారా లింపిక్స్ లో స్వర్ణం సాధించిన భారత నాలుగో అథ్లెట్ గా నిలిచించింది అవని. ప్రస్తుతం ఈ క్రీడాకారిణి వయసు కేవలం 19 సంవత్సరాలే కావడం విశేషం.
ఈ పోటీల్లో పతకంతోపాటు సరికొత్త రికార్డు సృష్టించాడు దేవేంద్ర జజారియా. జావెలిన్ త్రో పోటీల్లో రజత పతకం సాధించాడు. 64.35 మీటర్ల దూరం ఈటెను విసరడం ద్వారా.. రజతం సాధించడంతోపాటు తన వ్యక్తిగత రికార్డును కూడా మెరుగు పరుచుకున్నాడు. కాగా.. ఈ గెలుపుతో పారా లింపిక్స్ లో మూడుసార్లు పతకం సాధించి, హ్యాట్రిక్ వీరుడిగా నిలిచాడు దేవేంద్ర. 2004, 2016 పోటీల్లో ఏకంగా స్వర్ణ పతకాలు సాధించాడు. దేవేంద్రకు ఎడమ చేయి లేదు.
పారా లింపిక్స్ లో సత్తా చాటిన మరో ఆటగాడు యోగేశ్ కతునియా. పురుషుల ఎఫ్-56 డిస్కస్ త్రో విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు యోగేశ్. డిస్క్ ను 44.38 మీటర్ల దూరం విసిరి రెండో స్థానం సాధించాడు. పక్షవాతం కారణంగా దేహంలో కొన్ని అవయవాలు పనిచేయకపోయినా.. పారా లింపిక్స్ క్రీడల్లో పాల్గొని రజతం గెలవడం గమనార్హం. గతంలోనూ పలు పతకాలు సాధించాడు యోగేశ్.
సుందర్ సింగ్ గుర్జార్ కూడా జావెలిన్ త్రో విభాగంలోనే పతకం సాధించాడు. ఎఫ్-46 విభాగంలో పోటీ పడ్డ గుర్జార్.. 64.01 మీటర్ల దూరం ఈటెను విసిరి.. కాంస్య పతకం సాధించాడు. జైపూర్ కు చెందిన గుర్జార్.. 2015లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. అతని ఎడమ చేయి దెబ్బ తిన్నది. 2017, 2019 పారా అథ్లెటిక్ పోటీల్లో సర్ణ పతకాలు గెలిచాడు గుర్జార్. ఈ విధంగా సోమవారం ఈ నలుగురు ఆటగాళ్లూ పతకాలు సాధించి.. మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు.