
వినడానికి సిల్లీగా ఉన్నా.. ఇదే నిజం! అవును.. మల్లెపూలు తేలేదని భర్తను చంపిందో మహిళ! ఇందుకోసం సుపారీ ఇచ్చి కిరాయి మనుషులను పెట్టి.. కిరాతకంగా చంపేసింది. ఈ విషయాన్ని పోలీసులే నిర్ధారించారు. అయినా.. నమ్మశక్యంగా లేదా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
రాజస్థాన్ కు చెందిన దేవీసింగ్ పశువుల దాణా వ్యాపారం చేస్తుంటాడు. అంతకు ముందు ఎలాంటి బెదిరింపులూ రాలేదు. ఎవరితోనూ పంచాయతీ పెట్టుకోలేదు. ఆగస్టు 22న ముగ్గురు వ్యక్తులు పగటి పూటనే బైక్ పై దేవీసింగ్ ఇంటికి వచ్చారు. తలుపు తీసిన దేవీసింగ్ ను కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపేసి, అనంతరం పారిపోయారు.
దేవీసింగ్ భార్య పింకీ కళ్లముందే ఈ దారుణం జరిగిపోయింది. అరుపులు, కేకలకు చుట్టుపక్కల వాళ్లంతా వచ్చే సరికే పని పూర్తయింది. దుండగులు చేతుల్లో ఉన్న కత్తులు చూసి ఎవ్వరూ ముందుకు రాలేదు. వాళ్లు బైక్ పై పారిపోయిన తర్వాత వచ్చి చూస్తే.. అప్పటికే దేవీసింగ్ ప్రాణాలు కోల్పోయాడు. భార్య పింకీ.. మృతదేహంపై పడి రోధించడం మొదలు పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
దేవీసింగ్ కు వ్యాపారంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా? అనే కోణంలో విచారణ జరిపారు. కానీ.. ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఏ కేసులోనైనా మొదటి సాక్షి.. ముద్దాయి అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసులు ఈ కోణంలో కేసును తవ్వడం మొదలు పెట్టారు. ఈ కేసులో మొదటి సాక్షి భార్యే. పింకీ కళ్ల ముందే హత్య జరిగింది కాబట్టి.. ఆమె వైపు నుంచే దర్యాప్తు షురూ చేశారు.
ఎవరు వారు? ఎలా వచ్చారు? ఎప్పుడు వచ్చారు? గొడవ ఏంటీ? అని గుచ్చి గుచ్చి అడిగితే.. జవాబులో తడబాటు మొదలైంది. దీన్ని వెంటనే పసిగట్టారు పోలీసులు. అసలు నిజం చెప్పమంటే.. బుకాయించే ప్రయత్నం చేసింది. నిజం చెప్పకపోతే ఆ కథే వేరుగా ఉంటుందని అన్నారు. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో లైవ్ లో పరోక్షంగా చూపించారు. దీంతో.. అసలు విషయం బయటపెట్టింది పింకీ.
తానే భర్తను చంపించానని చెప్పింది. ఎందుకు అని అడిగితే.. ఆమె చెప్పిన ఆన్సర్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. దేవీసింగ్ ఆమెకు మల్లెపూలు తేవట్లేదట. లోతుగా ఆరాతీస్తే.. అతను భార్య పింకీతో గతంలో మాదిరిగా ఉండట్లేదట. ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడట. ఒక్కోసారి రావట్లేదట. అడిగితే.. ఏవో వ్యాపార కారణాలు చెబుతున్నాడట. దీంతో.. చిన్న ఇల్లు ఓపెన్ చేశాడేమోనని పింకీకి డౌట్ వచ్చిందట. ఈ అనుమానం రానురానూ మరింత ముదిరి అతనిపై కోపం, ద్వేషం పెరిగిపోయాయట. దీంతో.. చివరకు చంపేయాలని డిసైడ్ అయ్యిందట.