Varalakshmi Vratam 2024: వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన సామాగ్రి.. పూజ విధానం..

కుంకుమ, పసుపు, గంధం,పూల మాలలు, విడిపూలు, తమలపాకులు,కర్పూరం, 30 వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, బ్లౌజ్ పీసు, మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరి కాయలు, తెల్ల దారం తీసుకోవాలి.

Written By: Swathi, Updated On : August 13, 2024 11:29 am

Varalakshmi Vratam 2024

Follow us on

Varalakshmi Vratam 2024: శ్రావణ మాసం వచ్చిందంటే అందరి ఇల్లు నిండు పూజలతో, నియమ నిష్టలతో అందంగా ముస్తాబు అవుతాయి. ఈ నెలలో శ్రావణ సోమవారం పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు, మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం, నాగ పంచమి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఇలా చెప్పుకుంటూ పోతే శ్రావణ మాసం మొత్తం చాలా ప్రత్యేకమైన రోజులే ఉంటాయి. ఈ పండుగల్లో వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉంది. అష్టలక్ష్ముల్లో వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ అంటారు. అందుకే శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేకంగా ఈ తల్లిని పూజిస్తారు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున అందరూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి.. అమ్మవారిని ఎలా ఆరాధించాలి.. పూజా విధానానికి సంబంధించిన పద్ధతులు, ఆచారాల గురించి పూర్తిగా ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

కావాల్సిన పూజా సామాగ్రి..
కుంకుమ, పసుపు, గంధం,పూల మాలలు, విడిపూలు, తమలపాకులు,కర్పూరం, 30 వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, బ్లౌజ్ పీసు, మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరి కాయలు, తెల్ల దారం తీసుకోవాలి. లేదంటే నోము దారం తీసుకోవాలి. పసుపు రాసిన కంకణం, అమ్మవారి కోసం తయారు చేసిన ప్రసాదాలు. అక్షింతలు, పంచామృతాలు. దీపారాధన కోసం వత్తులు, నెయ్యి.

ప్రత్యేకమైన వరలక్ష్మీ వ్రతం రోజును వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా వ్రతం చేసుకోవచ్చు. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ అంటే పవిత్రమైన శుక్రవారం పర్వదినాన జరుపుకునే వరలక్ష్మీ వ్రతంతో సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సుతో పాటు పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అంటారు పండితులు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం అనునిత్యం పొందవచ్చట.

తోరణం తయారు..
తెల్లని దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని.. దానికి పూర్తిగా పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది బంతిపూలు లేదా పసుపు రంగులోని పువ్వులను కట్టి ముడులు వేసుకోవాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకోవాలి అంటారు పండితులు. అనంతరం అమ్మవారి పీఠం వద్ద ఉంచిన పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, తోరాలను పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. తోరాలను తయారు చేసుకున్న అనంతరం పూజను ప్రారంభించాలి. ముందుగా వినాయకునికి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారి పూజ చేయాలి.

వినాయకుడి పూజకు సంబంధించిన పూర్తి మంత్రాల తర్వాత వరలక్ష్మీ వ్రతం కథను చదవడం ప్రారంభించాలి. పూజ అయిన తర్వాత అక్షింతలను తలపై చల్లుకోవాలి. వచ్చిన ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. చివరగా తయారు చేసుకున్న ప్రసాదాన్ని కూడా పంచాలి. పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని పూజ చేసిన వారు మాత్రమే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటటే మీరు కోరుకున్న వరాలన్నింటినీ వరలక్ష్మీ నెరవేరుస్తుంది అని అంటారు పండితులు.