Pawan Kalyan: జనసేనలో ఒక వెలుగు వెలిగిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. వెళుతూ వెళుతూ పవన్ గుట్టును రట్టు చేస్తానని హెచ్చరించారు. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారు. టిడిపి తో పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయని తాజాగా ఆరోపించారు. పనిలో పనిగా నాదెండ్ల మనోహర్ పై సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. పది కోట్ల రూపాయల విలువచేసే స్పోర్ట్స్ కారు నాదెండ్ల మనోహర్ కు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోతిన మహేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయనపై జనసేన శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి.విజయవాడ పశ్చిమ సీటు ఆశించిన పోతిన మహేష్.. టికెట్ దక్కకపోయేసరికి తీవ్ర అసంతృప్తికి గురవుతూ జనసేన ను వీడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మహేష్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ప్రతి రాజకీయ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు వస్తుంటాయి. ఈ లెక్కన జనసేనకు చాలా విరాళాలు వచ్చాయని తాజాగా పోతిన మహేష్ ఆరోపించారు. మొన్న ఆ మధ్యన విరాళాలను సాకుగా చూపి చాలామంది జనసేన టికెట్లు ఆశించారు. కానీ వారికి టిక్కెట్లు దక్కకపోయేసరికి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అటువంటి వారికి తిరిగి విరాళాలు ఇచ్చేశారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో జనసేనకు పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయని పోతిన మహేష్ ఆరోపిస్తుండడం విశేషం.పవన్ కళ్యాణ్ ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కౌలు రైతుల కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందింది. అయితే ఈ సాయానికి గాను పవన్ ఎన్నారైల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని తాజాగా పోతిన మహేష్ ఆరోపించడం సంచలనం గా మారింది.
పవన్ కళ్యాణ్ పై ఆరోపణల్లో భాగంగా మధ్యలో దిల్ రాజు ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మలాకత్ ద్వారా కలిసిన పవన్ ఆర్థిక ప్యాకేజీకి అమ్ముడుపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సొమ్ము బ్లాక్ కావడంతో వైట్ గా మార్చుకునేందుకే హరిహర వీరమల్లు సినిమా ద్వారా రూటింగ్ చేస్తున్నారని.. అందుకే దిల్ రాజు ఐటీ కి ఫిర్యాదు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అభ్యర్థులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం ఏమిటని పోతిన మహేష్ ప్రశ్నించారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని నాదెండ్ల మనోహర్ డబ్బు సంపాదించడంలో దిట్ట అని విమర్శించారు. ఆయనకు 10 కోట్ల రూపాయల విలువ చేసే స్పోర్ట్స్ కారు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తాను ఆధారాలతో మాట్లాడుతున్నానని.. తన ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటే ఎప్పుడైనా? ఎక్కడైనా? చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట పోతిన మహేష్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో రచ్చకు కారణమవుతున్నాయి. వైసిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తుండగా.. జన సైనికులు స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నారు. దీంతో ఇది వివాదాస్పద అంశంగా మారుతోంది.