Telugu News » Spiritual » Jagan offerd to balineni as a nellore district ycp president who rejected s offer
Balineni Srinivas Reddy : జగన్ ఆఫర్ ను తిరస్కరించిన బాలినేని.. ఇప్పటికే స్ట్రాంగ్ డెసిషన్*
వైసీపీ సీనియర్లలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకరు.వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేసిన నేత.సమీప బంధువు కావడంతో జగన్ కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. క్యాబినెట్లో చోటు కల్పించారు. కానీ గత కొంతకాలంగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్నారు బాలినేని. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.
Balineni Srinivas Reddy : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడుతారా? ఆయన తుది నిర్ణయానికి వచ్చేసారా? మెగా బ్రదర్ తో టచ్ లో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గత కొంతకాలంగా పార్టీ హై కమాండ్ పై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉన్నారు. ఇటీవల ఈవీఎంలపై పోరాటం చేసే క్రమంలో తనకు పార్టీ నుంచి మద్దతు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. బాలినేని మాత్రం జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. అయితే ఇదంతా సొంత పార్టీ వారే చేయిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు బాలినేని. తాను జనసేనలో చేరడం వారికి ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాను మాత్రం వైసీపీలోనే ఉంటానని కరాకండిగా చెప్పడం లేదు. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ బాలినేని తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ముందు నుంచే అసంతృప్తితో ఉన్న బాలినేని జగన్ స్వయంగా సముదాయించడం ఇదే తొలిసారి. బాలినేని తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేయడంతోనే జగన్ కలిసినట్లు తెలుస్తోంది.
* జగన్ కు సమీప బంధువు
బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కు సమీప బంధువు. పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డికి స్వయానా బావ. సుబ్బారెడ్డి జగన్ కు బాబాయ్ అవుతారు. ఈ విధంగా జగన్ తో బాలినేనికి బంధుత్వం ఉంది. అయితే వైసిపి హయాంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో బాలినేనికి ఉద్వాసన పలికారు. అదే జిల్లాకు చెందిన ఆదిమూలం సురేష్ కు మాత్రం కొనసాగించారు.దీని వెనుక వైవి సుబ్బారెడ్డి ఉన్నారన్నది బాలినేని ఆరోపణ. మరోవైపు ఒంగోలు ఎంపీగా మాగంటి శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వాలని జగన్ పై బాలినేని ఒత్తిడి చేశారు. కానీ జగన్ వినలేదు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలను తగ్గించారు. ఓడిపోయిన తర్వాత ఒంగోలు ముఖం చూడడం మానేశారు.
* చెవిరెడ్డి పెత్తనం
ప్రకాశం జిల్లా పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెత్తనాన్ని బాలినేని సహించలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటును చెవిరెడ్డికి ఇచ్చారు. ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన నేత. తనను తొక్కి పెట్టేందుకే జగన్ తెరపైకి చెవిరెడ్డిని తెచ్చారన్నది బాలినేని అనుమానం. అందుకే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభ్యంతరాలను సైతం జగన్ పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు బాలినేనికి ఒంగోలు జిల్లా బాధ్యతలను అప్పగిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. అందుకే బాలినేని పార్టీని వీడడం ఖాయమని ప్రచారం జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో జగన్ బాలినేని తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* జిల్లా అధ్యక్ష పదవి ఆఫర్
బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఒంగోలు జిల్లా బాధ్యతలు తీసుకోవాలని జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో తన మాటను పట్టించుకోకపోవడంపైబాలినేని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు జిల్లా అధ్యక్ష పదవి అక్కర్లేదని తిరస్కరించినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే బాలినేని మెగా బ్రదర్ నాగబాబు తో టచ్ లో ఉన్నారని.. త్వరలో ఆయన జనసేనలో చేరడం ఖాయమని.. అందుకే జగన్ ఆఫర్ ను తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. బాలినేని పార్టీ మారడంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.