MLA Adhimoolam : సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం బిజెపిలో చేరుతారా? ఆ దిశగా ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.తెలుగుదేశం మహిళా నాయకురాలిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు.ఎన్నికలకు ముందే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. సత్యవేడు టిక్కెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మూడు నెలలు గడవకముందే ఆయన పార్టీకి దూరమయ్యారు. అయితే కనీసం తనకు నోటీసులు ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేయడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇంత జరిగాక పార్టీలో కొనసాగడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. అందుకే తమిళనాడు బిజెపి నేతల ద్వారా ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
* ఆధారాలతో సహా ఫిర్యాదు
తనపై ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా దాడి చేశారని టిడిపి నాయకురాలు నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా బయటపెట్టారు.సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించిన వీడియోలను సైతం అందించారు.దీంతో మారు మాట లేకుండా టిడిపి హై కమాండ్ ఆదిమూలమును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే దీనిని ఆదిమూలం కుటుంబ సభ్యులు, అనుచరులు తప్పుపడుతున్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా నేరుగా చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
* వెనువెంటనే చర్యలు
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. డీఎన్ఏ ను పరిశీలిస్తున్నారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఏకంగా పార్టీకి చెందిన ఒక నాయకురాలు తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పడంతో హై కమాండ్ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నేతలపై లైంగిక ఆరోపణలు వచ్చి ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో.. వెనువెంటనే టిడిపి ఈ ఘటనపై స్పందించింది. చర్యలకు ఉపక్రమించింది.
* మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే
అయితే టిడిపి అధిష్టానం వ్యవహరించిన తీరుతో ఎమ్మెల్యే ఆదిమూలం మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.కనీసం తన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా.. కనీసం విచారణ చేపట్టకుండా.. తాను తప్పు చేశానని నిర్ధారించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు.టిడిపిలో సైతం ఆయనకు పెద్దగా మద్దతు లభించడం లేదు.ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు సన్నిహిత బిజెపి నేతల ద్వారా ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో,ఎన్డీఏలో చంద్రబాబు కీలకపాత్రవహిస్తున్న పరిస్థితుల్లో ఆదిమూలమును బిజెపిలోకి తీసుకోవడం అనుమానమేనన్న విశ్లేషణలు ఉన్నాయి.మరి ఏం జరుగుతుందో చూడాలి.