Deputy CM Pavankalyan : ఏపీ ప్రభుత్వంలో పవన్ పాత్ర కీలకం. కీలకమైన నాలుగు శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆపై డిప్యూటీ సీఎం హోదా ఉంది. కూటమి ప్రభుత్వం ఉండడంతో పవన్ కు సరైన ప్రాధాన్యత దక్కుతోంది. ప్రోటోకాల్ ప్రకారం సీఎం చంద్రబాబు పవన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన అభివృద్ధికి తగ్గట్టు పల్లె పాలనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణ శాఖలను కేటాయించారు. ఆయన కోసం విజయవాడలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. అయితే పవన్ ఆది నుంచి ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. మంత్రిగా జీతభత్యాలు తీసుకోవడం లేదు. తనకు ఫర్నిచర్ సైతం ఏర్పాటు చేయవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుతో పాటు అన్ని వసతులను సమకూర్చారు. కానీ వైసీపీ దీనిపై దుష్ప్రచారం చేస్తోంది. కేవలం పవన్ క్యాంపు కార్యాలయం కోసమే 82 లక్షలు ఖర్చు పెట్టారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ప్రచారం జరుగుతోంది. దీనికి చెక్ చెప్పే విధంగా పవన్ నిర్ణయం తీసుకోవడం విశేషం.
* ఏడాదిగా సినిమాలకు దూరం
దాదాపు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు పవన్. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు. జనవరి నుంచి సినిమా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు.ఎన్నికల వ్యూహాలు, ఎన్నికల ప్రచారం, కూటమి తరుపున సమన్వయం చేసుకోవడం వంటి వాటితో బిజీగా మారారు. పవన్ కృషి మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. ఇంకా సినిమా షూటింగ్లను సైతం ప్రారంభించలేదు. అయితే పవన్ విషయంలో ఏ చిన్న పార్టీ తప్పిదం జరిగిన భూతద్దంలో పెట్టి బయటకు తీస్తోంది వైసిపి.
* దుబారా ఖర్చు తగ్గింపు
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం విషయంలో పవన్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.తనవరకు దుబారా ఖర్చు తగ్గించే ప్రయత్నం చేశారు.అందులో భాగంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకున్నారు.తాను సొంతంగానే ఫర్నిచర్ ఏర్పాటు చేస్తానని.. ప్రభుత్వం తరుపున వద్దని కూడా వారించారు.మంత్రిగా అదనపు సౌకర్యాలు,వసతులకు కూడా దూరంగా ఉన్నారు.జీతభత్యాలను కూడా తిరస్కరించారు.అయినా సరే పవన్ పై దుష్ప్రచారం ఆగడం లేదు.ముఖ్యంగా క్యాంప్ ఆఫీస్ నిర్వహణ విషయంలో ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతుందని వైసిపి ఆరోపించడం ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది.
* మంగళగిరి నివాసమే క్యాంప్ ఆఫీస్
అయితే వైసిపి చేస్తున్న దుష్ప్రచారం పవన్ వరకు రావడంతో ఆయన స్పందించారు.కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ క్యాంప్ ఆఫీసును ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంప్ ఆఫీసుగా మార్చనున్నట్లు పవన్ వెల్లడించారు. తనవరకు పారదర్శకంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ సింప్లిసిటీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.